Reading Time: < 1 minute
Israel Lebanon Peace Talks Us Mediation Washington

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 14న (మంగళవారం) వాషింగ్టన్ వేదికగా అమెరికా ఆధ్వర్యంలో చర్చలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.

అయితే చర్చలు ప్రారంభం అయ్యేదాకా లెబనాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరింది. అందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరిస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. లెబనాన్‌తో చర్చలు అంగీకారమే గానీ.. హిజ్బుల్లాతో మాత్రం చర్చలు జరపబోమని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది.

బుధవారం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తాజాగా ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌తో జరిగిన ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని.. దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. అన్నట్టుగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో 357 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలు పాలయ్యారు.

అయితే వచ్చే వారం వాషింగ్టన్‌లో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగబోతున్నట్లుగా ఆక్సియోస్ నివేదించింది. అంతలోపు దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను లెబనాన్ కోరింది. అయితే లెబనాన్ అభ్యర్థనకు అమెరికా మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా సానుకూలంగా స్పందించాలని ఇజ్రాయెల్‌ను కూడా కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

శుక్రవారం వాషింగ్టన్‌లోని రాయబారుల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సందర్భంగా అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మంగళవారం అమెరికా విదేశాంగ శాఖలో ఒక అధికారిక సమావేశం నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే లెబనాన్‌తో శాంతి ఒప్పందం కోసం కృషి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని.. కానీ హిజ్బుల్లాతో కాల్పుల విరమణపై చర్చించబోదని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ పేర్కొన్నారు.