
రాగి పాత్రలోని నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందనేది నిజం. అయితే, దీనిని అతిగా లేదా తప్పుడు పద్ధతిలో వాడటం వల్ల ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ప్రాణాపాయం లేదా తీవ్ర అనారోగ్యానికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగిపాత్రలో నీరు తాగటానికి సరైన సమయం, పద్ధతి ఉన్నాయని చెబుతున్నారు. ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం..
నీరు ఆరోగ్యానికి మంచిదే కదా అని రోజంతా రాగి పాత్రలోని నీటినే తాగకూడదు. శరీరానికి రోజుకు కొంత పరిమాణంలోనే రాగి అవసరమవుతుంది. అంతకు మించి తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. రాగి పాత్రలో ఎప్పుడూ నిమ్మరసం, వెనిగర్, పెరుగు లేదా మజ్జిగ వంటి పదార్థాలను ఉంచకూడదు. రాగిలోని లోహం పుల్లటి పదార్థాలలోని యాసిడ్లతో చర్య జరిపి విషపూరితమైన పదార్థాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. రాగి పాత్రలు లోపల నల్లగా లేదా ఆకుపచ్చగా మారినప్పుడు వాటిని వాడటం ప్రమాదకరం. ఆ ఆకుపచ్చని పొర (Copper Carbonate) శరీరంలోకి వెళితే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు కలుగుతాయి.
రాగి పాత్రలోని నీటిని తాగేందుకు సరైన సమయం ఉంటుంది. అందుకోసం రాత్రిపూట రాగి పాత్రలో నీటిని పోసి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాగడం అత్యంత ఉత్తమం. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులకు మించి రాగి నీటిని తీసుకోకపోవడం మంచిది. దీంతో పాటుగా రాగి పాత్రలను శుభ్రం ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. నిమ్మకాయ లేదా చింతపండుతో పాత్రను తరచుగా శుభ్రం చేస్తూ లోపలి భాగం మెరుస్తూ ఉండేలా చూసుకోవాలి. రాగి పాత్రలోని నీరు ఒక ఔషధం లాంటిది. ఔషధాన్ని పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యం, అతిగా తీసుకుంటే అది విషం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తూ రాగి వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను పొందొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..