
తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుందనే అక్కసుతో ఓ ఉన్మాది వికృత చేష్టలకు ఓ యువతి బలవన్మరణానికి పాల్పిడింది. ఈ సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న కందికొండ చిరంజీవి కుమార్తె రమణి (24)కి సమీప బంధువు వరుసకు బావ అయ్యే మనోహర్ (25)తో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో కొద్ది రోజులకు మనోహర్‌కు హెచ్‌ఐవీ ఉందని తెలియడంతో సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో మనోహర్ ఉన్మాదిగా మారాడు. తనను కాదని వేరే పెళ్లి చేసుకొని ఎలా ఆనందంగా ఉంటావంటూ ద్వేషం పెంచుకొని,గత సంవత్సరం మే నెలలో ఇంజెక్షన్ ద్వారా హెచ్‌ఐవీ రక్తం రమణికి బలవంతంగా ఎక్కించాడు.
ఈ క్రమంలో యువతి అనారోగ్యానికి గురి కావండంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించగా హెచ్‌ఐవీ అని నిర్ధారణ కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మనోహర్‌ను ఆరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా నాటి నుంచి యువతి మనోవేధనకు గురైంది. దీంతో మనస్థాపంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి అమ్మానాన్న నన్ను క్షమించండి, మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతాను, చెల్లి, తమ్ముడు అమ్మానాన్నను మంచిగా చూసుకొండి అని లెటర్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రమణిని ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.