
టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ఉద్యోగుల లేఆఫ్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం భారీగా నిధులు అవసరం కావడంతో సంస్థ ఏకంగా 30వేల మంది ఉద్యోగులను కొద్ది రోజుల కిందటే ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. ఈ మెగా లేఆఫ్స్‌లో భాగంగా కాలిఫోర్నియాలో సుమారు 700 మందిపై వేటు పడనుంది. రెడ్‌వుడ్ సిటీ, శాంటా క్లారా, ప్లెసెంటన్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని ఐటీ నిపుణులు జూన్ 1 నాటికి తమ డెస్కులను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ ఆఫీసుల్లోనూ ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉద్యోగులకు పంపిన లేఆఫ్ మెయిల్స్ వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తెల్లవారుజామున 6 గంటలకే వచ్చిన “ఈరోజే మీ చివరి పనిదినం” అనే మెయిల్ చూసి చాలా మంది షేకే పోయారు. సియాటిల్ కార్యాలయంలో పనిచేసే దాదాపు 491 మంది రిమోట్ ఉద్యోగులు కూడా ఈ కోతకు గురయ్యారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ పేర్కొంది. తొలగించిన వారికి సర్వీస్ రూల్స్ ప్రకారం సెవెరెన్స్ ప్యాకేజీ అందజేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
ALSO READ : అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో అల్లకల్లోలం..
ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణలో భాగంగానే లారీ ఎల్లిసన్ నేతృత్వంలోని ఒరాకిల్ ఈ సాహసోపేతమైన అడుగు వేసిందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ పేర్కొంది. అవసరమైతే కొన్ని ఆస్తులను అమ్మేందుకు కూడా కంపెనీ వెనకాడటం లేదు. గతేడాది మే నెల నాటికి లక్షా 62వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులున్న ఈ సంస్థలో.. ప్రస్తుత కోత టెక్ రంగంలో గత 12 నెలల్లోనే అతిపెద్దదిగా నమోదైంది. కేవలం ఒరాకిల్ మాత్రమే కాదు.. మెటా వంటి ఇతర దిగ్గజాలు కూడా ఏఐ ఖర్చుల కోసం ఉద్యోగాల కోతను ఆశ్రయిస్తున్నాయి.
ALSO READ : ఆరు వారాల నష్టాలకు బ్రేక్..
టెక్ ప్రపంచంలో ఏఐ రాకతో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 70కి పైగా కంపెనీలు సుమారు 40వేల 480 మందిని తొలగించాయి. టెక్ కంపెనీలు తమ వనరులను మనుషుల నుంచి మెషీన్ లెర్నింగ్, ఏఐ వైపు మళ్లిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ నిపుణులు భవిష్యత్తుపై భయపడుతున్నారు. ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఇతర టెక్ సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.