Reading Time: < 1 minute

కీలక పదవుల్లో ఉన్నోళ్లంతా ఎన్‌ఎస్‌యూఐ నేతలే : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Caption of Image.
  •     కాంగ్రెస్‌ స్టూడెంట్‌ వింగ్‌ ఆవిర్భావ వేడుకల్లో మహేశ్‌ గౌడ్‌
  •     చిన్న నాయకుడి నుంచి పీసీసీ చీఫ్‌ గా ఎదిగానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా ఉన్న నేతలంతా ఎన్‌ఎస్‌యూఐ నుంచి వచ్చిన వారేనని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఆ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఆలోచనల మేరకు ఆమె ప్రోత్సాహంతో ఎన్‌ఎస్‌యూఐ కాంగ్రెస్‌కు అనుబంధ విద్యార్థి సంఘంగా ఏర్పడిందని తెలిపారు.

ఈ సంస్థలో చిన్న నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, పీసీసీ చీఫ్ గా ఎదిగానని చెప్పారు. పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతే గుర్తింపు ఉంటుందని, పదవులు వస్తాయని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌యూఐ లాంటి విద్యార్థి సంఘాలు లేకుంటే తనలాంటి మొదటితరం రాజకీయాల్లోకి వచ్చేవాళ్లం కాదన్నారు. 

విద్యా కమిషన్ కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని, కేంద్ర యూనివర్సిటీలతో పాటు రాష్ట్ర వర్సిటీల్లో ఎన్నికలు జరపాలన్నారు. ఈ విషయంలో విద్యార్థి సంఘాల నేతలను తాను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమానికి పీసీసీ చీఫ్ జీన్ ప్యాంట్, టీ షర్టులో హాజరై విద్యార్థి నేతగా గతంలో పనిచేసిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.