
Mukul Chaudhary : ఐపీఎల్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు వచ్చారు.. మరెన్నో రికార్డులు సృష్టించారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఒక 21 ఏళ్ల కుర్రాడు చేసిన విన్యాసం చూస్తుంటే సాక్షాత్తు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటి దాకా ఎవరికీ తెలియని ముకుల్ చౌదరి అనే పేరు, ఇప్పుడు ప్రపంచ క్రికెట్ విశ్లేషకుల నోళ్లలో నానుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని విజయాన్ని అందించి రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ఒక దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అందరూ కేకేఆర్ గెలుపు ఖాయమనుకున్నారు. కానీ 7వ నంబర్ బ్యాటర్‌గా వచ్చిన ముకుల్ చౌదరి అద్భుతం చేశాడు. కేవలం 27 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో విశేషం ఏంటంటే.. తను చేసిన 54 పరుగుల్లో 53 పరుగులు కేవలం ఇన్నింగ్స్ చివరి ఐదు ఓవర్లలోనే వచ్చాయి.
దిగ్గజాల క్లబ్‌లోకి ముకుల్
ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఒక సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్‌లో చివరి 5 ఓవర్లలో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా ముకుల్ చౌదరి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన వారు ఇద్దరే ఇద్దరు.. వారు కీరన్ పొలార్డ్ (2013), ఏబీ డివిలియర్స్ (2014). ఇప్పుడు వీరి సరసన ముకుల్ చేరిపోయాడు.
సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో ఆఖరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు:
కీరన్ పొలార్డ్: 59 పరుగులు (సన్ రైజర్స్ పై – 2013)
ఏబీ డివిలియర్స్: 56 పరుగులు (సన్ రైజర్స్ పై – 2014)
ముకుల్ చౌదరి: 53 పరుగులు (కోల్‌కతా పై – 2026)
ధోనీ స్టైల్లో హెలీకాప్టర్ షాట్
ముకుల్ తన ఇన్నింగ్స్ ఆరంభంలో 8 బంతుల్లో కేవలం 2 పరుగులే చేశాడు. కానీ గేర్ మార్చిన తర్వాత ఆ వేగం మామూలుగా లేదు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో ముకుల్ ఆడిన హెలీకాప్టర్ షాట్ చూసి స్టేడియం మొత్తం ఫిదా అయిపోయింది. అచ్చు ఎంఎస్ ధోనీని తలపించేలా ఆ షాట్ ఉండటం విశేషం. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా, ఒత్తిడిలో కూడా ముకుల్ ఐదో బంతికి సిక్సర్ బాది స్కోర్లు సమం చేశాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కేకేఆర్ పరాజయం – లక్నో జోరు
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 181 పరుగులు చేసినా, ముకుల్ చౌదరి ధాటికి తలవంచక తప్పలేదు. లక్నో తరపున ఆయుష్ బదోని (54) కూడా అద్భుతంగా ఆడి జట్టుకు వెన్నుముకగా నిలిచాడు. కేకేఆర్ తరపున వైభవ్, అనుకూల్ రాయ్ రెండేసి వికెట్లు తీసినా లాభం లేకుండా పోయింది. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగా, కేకేఆర్‌కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..