Reading Time: 2 minutes
Heal Admissions 2026: పేదింటి విద్యార్ధులకు అలర్ట్.. హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌! ఇక్కడ అన్నీ ఫ్రీ

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ ఏర్పాటు చేసిన హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ తరగతి (ఇంటర్మీడియట్‌) ఇంగ్లీష్‌ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ గ్రూపుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీటు పొందిన విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన విద్యతోపాటు వసతి, భోజనం అందిస్తారు. ఈ మేరకు హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌ హీల్‌ సీఈవో కె అజయ్‌ కుమార్‌ ప్రకటన వెలువరించారు. హీల్‌ ప్రవేశ పరీక్ష 2026, ఇంటర్వ్యూ ఆధారంగా విద్యార్ధులకు సీట్లు కేటాయిస్తారు.

హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

చదువుకునే వయసులో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్లోయి అనాథలైన నిరుపేద విద్యార్ధులు చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన విద్యాసంస్థే హీల్ ప్యారడైజ్‌లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్సీ పాఠ్య ప్రణాళికతో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 10వ తరగతిలో 480 మార్కులు లేదా సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ విద్యార్థులు 400 పైన మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెల్లరేషన్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా సమర్పించవల్సి ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు మే 18, 2026వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అన్‌లైన్‌ విధానంలో నేరుగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ లేదా info@healparadise.org ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 9100024438, 9100024435 ఫోన్‌ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.

హీల్‌ పాఠశాలలో 15 వేల పుస్తకాలతో అతి పెద్ద గ్రంథాలయం, విద్యార్థుల ఆసక్తి ఉన్న కళల్లోనూ అంటే 3డీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం వంటి తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్​బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, హ్యాండ్​బాల్ కోర్టులు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో వసతి గృహాలు ఉన్నాయి. విశాలమైన భోజనశాల, సోలార్ వంటగది, ఆర్వో వాటర్ ప్లాంట్ సదుపాయం, వేడి నీటి సౌకర్యాలు సైతం ఉన్నాయి. స్మార్ట్‌ తరగతి గదుల్లో ఆన్‌లైన్‌ తరగతులు కూడా నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్‌ ల్యాబ్స్‌ కూడా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్ధులు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు మెడికల్, ఇంజినీరింగ్‌ ఇతర కోర్సుల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు హీల్‌ సహాకారం అందిస్తుంది.

హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.