Reading Time: < 1 minute
Andhra Pradesh: ఎమ్మెల్యే పదవితో పాటు అవి బోనస్‌గా వచ్చాయి.. రోజా కామెంట్స్ వైరల్..

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. ప్రత్యర్థులపై పంచ్ డైలాగులతో విరుచుకుపడే ఆమె తాజాగా నగరిలో జరిగిన వైసీపీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలవడం వల్ల తనకు అధికారంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా బంపర్ ఆఫర్‌లా వచ్చాయని సరదాగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉండటం అంటే నిరంతరం ఒత్తిడితో కూడుకున్న పని అని.. తన రాజకీయ ప్రస్థానంలో పదవులతో పాటు వచ్చిన మార్పులలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తనకు బీపీ వచ్చిందని.. రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు షుగర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అందరినీ ఒకేలా సంతృప్తి పరచడం సాధ్యం కాదని, కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా నగరి ప్రజలకు, వైసీపీ కేడర్‌కు తన శక్తి వంచన లేకుండా సాయం చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు.

స్థానిక ఎన్నికలే లక్ష్యం

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో తిరిగి వైసీపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. తమకు అబద్ధాలు చెప్పడం తెలియకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఫలితాలు ఇలా వచ్చాయని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోలేకపోవడం వల్లే నేడు రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ప్రజలు భావిస్తున్నారని ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు..

ప్రస్తుత నగరి టీడీపీ ఎమ్మెల్యే తీరుపై రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘‘చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా ప్రస్తుత ఎమ్మెల్యే తీరు ఉంది. కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడటమే పనిగా పెట్టుకున్నారు. నగరి కొండచుట్టును కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా?’’ అని ప్రశ్నించారు. పదవి అనేది ఒక బాధ్యత అని, అది కేవలం అలంకరణ కోసం కాదని ప్రత్యర్థులకు చురకలు అంటించారు. మొత్తానికి రోజా చేసిన ఈ ‘హెల్త్ అప్‌డేట్’ మరియు రాజకీయ విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.