
దేశంలోని టాప్ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన టెక్కీలకు వార్షిక వేతన పెంపును ప్రకటిస్తూ ఖుషీ చేసింది. ఒకపక్క ఏఐ, మరోపక్క జాబ్ లేఆఫ్స్ భయాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న టెక్కీలకు కొత్త ఆర్థిక సంవత్సరం తీపి కబురు చెప్పింది కంపెనీ. ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని గ్రేడ్‌ల ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆర్థిక మాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సవాళ్లు ఉన్నప్పటికీ.. టాటా గ్రూప్ తన ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ భరోసా ఇచ్చింది.
కేవలం జీతాలు పెంచడమే కాకుండా.. భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండేలా ఏఐ ఫస్ట్ సంస్కృతిని నిర్మించడంపై టీసీఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా అనుభవజ్ఞులను, క్యాంపస్ హైర్స్‌ను తీసుకున్నామని.. రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ నేర్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సుదీప్ కున్నుమ్మల్ స్పష్టం చేశారు. కంపెనీ తన క్లయింట్స్ అవసరాలకు తగ్గట్టుగా టెక్కీలను భవిష్యత్తు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా తగ్గడం లేదు.
కంపెనీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే.. టీసీఎస్ లాభాల పంట పండించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకంగా 12 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.13వేల 718 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో లాభం రూ.12వేల 224 కోట్లుగా ఉంది. రెవెన్యూ పరంగా కూడా 9.6 శాతం వృద్ధితో రూ.70వేల 698 కోట్ల బిజినెస్ చేసి ఐటీ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చూపించింది టీసీఎస్.
మొత్తానికి మూడు మెగా డీల్స్, 12 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ విలువతో టీసీఎస్ ఫుల్ జోష్‌లో ఉంది. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. టెక్నాలజీపై కస్టమర్లకు ఉన్న నమ్మకమే తమను ముందుకు నడిపిస్తోందని సీఈఓ కె. కృతివాసన్ అన్నారు. మొత్తానికి వేతన పెంపు ప్రకటనతో అటు టెక్కీలు, ఇటు అదిరిపోయే లాభాలతో ఇన్వెస్టర్లు.. ఇద్దరూ పండగ చేసుకుంటున్నారు. టీసీఎస్ దెబ్బకు ఐటీ మార్కెట్ మరోసారి కళకళలాడుతోంది. ఇన్వెస్టర్లలో లాభాల జోరు, హైక్స్ కొత్త నమ్మకాన్ని నింపుతున్నాయి.