
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వర్కింగ్ కమిటీ (సీడబ్లూసి) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. నేడు మధ్యాహ్నాం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నట్టుగా తెలిసింది.
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనలో సిఎం వెంట వెళ్లనున్నారు. రాష్ట్రంలో పాలన పరంగా 28 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, రాష్ట్ర అభివృద్ధి పనుల పురోగతిని సిఎం ఏఐసిసి అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ లేదా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా అధిష్టానంతో సిఎం ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. శుక్రవారం సాయంత్రం ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.