
ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు మదురుతున్నాకొద్దీ చాలా మందిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఎండలోకి వెళ్లిన వెంటనే తీవ్రమైన తలనొప్పికి గురవుతుంటారు. కొంతమంది దీనిని సాధారణ విషయంగా భావించి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ ఎండ వల్ల వచ్చే తలనొప్పి మీ శరీరం ఇస్తున్న ఒక బలమైన హెచ్చరిక సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. ఎండ తగిలిన వెంటనే కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. తల భారంగా అనిపించడం, కళ్లు మంటలు పుట్టడం, కళ్లు తిరగడం, విపరీతమైన నీరసం, అధికంగా చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చంచలత్వం వంటివి సమస్యలు వస్తాయి.
ఎండలో తలనొప్పికి ప్రధాన కారణాలు
ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అజిత్ జైన్ ప్రకారం.. ఎండలో తలనొప్పి రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి..
శరీర ఉష్ణోగ్రత పెరగడం: తీవ్రమైన వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల మెదడులోని రక్త నాళాలు వ్యాకోచించి తలనొప్పికి దారితీస్తాయి.
డీహైడ్రేషన్: ఎండలో చెమట రూపంలో శరీరం నీటిని, ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. మెదడు కణజాలం నీటిని కోల్పోయినప్పుడు అది సంకోచించి నొప్పిని కలిగిస్తుంది.
ఫోటోసెన్సిటివిటీ – మైగ్రేన్: తీవ్రమైన సూర్యరశ్మి, వెలుతురు మైగ్రేన్ ఉన్నవారికి ప్రధాన శత్రువులు. ఈ వెలుతురు మెదడులోని నరాలను ప్రేరేపించి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
లో బ్లడ్ షుగర్: ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లినప్పుడు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల తలనొప్పితో పాటు కళ్లు తిరగడం వంటివి సంభవిస్తాయి.
ఎవరికి ముప్పు ఎక్కువ..?
ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెట్టినప్పటికీ, ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి..
చిన్నారులు – వృద్ధులు: వీరిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి తక్కువగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు: వీరి శరీరానికి అదనపు హైడ్రేషన్ అవసరం.
ఫీల్డ్ వర్కర్లు: ఎండలో ఎక్కువ సేపు పనిచేసే మార్కెటింగ్, కన్స్ట్రక్షన్ రంగాల వారు.
మైగ్రేన్ బాధితులు: కాంతి తీవ్రతను తట్టుకోలేని వారు.
తలనొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సమస్యను నివారించడానికి వైద్యులు సూచిస్తున్న ప్రాథమిక చిట్కాలు ఇవే..
నీటి వినియోగం: బయటకు వెళ్లడానికి 30 నిమిషాల ముందే తగినంత నీరు తాగాలి. వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోవాలి.
రక్షణ కవచం: తల, ముఖంపై నేరుగా ఎండ పడకుండా గొడుగు, టోపీ లేదా కాటన్ రుమాలు వాడాలి. కళ్లకు యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ ధరించాలి.
ఆహారం: ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లవద్దు. శరీరానికి చలవ చేసే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి.
దుస్తులు: వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల గాలి ఆడి శరీరం చల్లగా ఉంటుంది.
సమయం: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.
ఎండలో తలనొప్పి రావడం అనేది వడదెబ్బకు ప్రాథమిక దశ కావచ్చు. కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒకవేళ తలనొప్పి సుదీర్ఘ కాలం వేధిస్తుంటే లేదా వాంతులు, కళ్లు తిరగడం వంటివి తోడైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.