
ఇరాన్, అమెరికా మధ్య శనివారం నాటి శాంతిచర్చలకు ఆతిధ్య వేదిక అయిన పాకిస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోనే కాల్పుల విరమణ చర్చలు జరుగుతాయి. దీనితో విదేశీ దౌత్యకార్యాలయాలు, దేశ పార్లమెంట్, ఇతర దేశాల ఆపీసులు, విలాసవంతమైన హోటల్స్ ఉండే రెడ్‌జోన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. రెండు రోజులుగా ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పలు కీలక మార్గాలు దాదాపుగా నిర్మానుష్యం అయ్యాయి. న్రభుత్వ భవనాలు, కీలక రహదారుల్లో కట్టుదిట్టమైన పహారా ఉంది. పూర్తి తనిఖీల తరువాత కానీ పౌరుల కదలికలకు వీల్లేని పరిస్థితి ఉంది. దీనితో జనం విసుగెత్తారు.
శాంతిచర్చలకు యుద్ధ వాతావరణం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. చర్చలు ఫలిస్తే అంతర్జాతీయంగా పాకిస్థాన్ ప్రతిష్ట పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇస్లామాబాద్ , ఇతర చోట్ల గురువారం నుంచే కార్యాలయాలకు సెలువులు ప్రకటించారు. ఇప్పటి చర్చలకు అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ సారధ్యంలో ఒక బృందం హాజరు కానుంది. ఈ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. ఇందులో ప్రత్యేక దూత స్టీవ్ వాట్కిఫ్, సీనియర్ సలహాదారు జెర్డ్ కుష్నేర్ ఉంటారని వెల్లడైంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ ఇస్లామాబాద్‌కు బయలుదేరారనే పాకిస్థాన్ వార్తలను ఇరాన్ ఖండించింది. వారు టెహరాన్‌లోనే ఉన్నారని , తొందరపాటు వార్తలు తగవని హితవు పలికింది. అయితే అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇరాన్ ప్రతినిధి బృందం దాదాపుగా పాకిస్థాన్ చేరుకుందని చెపుతున్నాయి.
పది అంశాలపై ఇరాన్ పట్టు ..
లెబనాన్‌పై యుద్ధం ఇజ్రాయెల్ బెట్టు
అతికష్టంమీద చర్చలకు పాకిస్థాన్ మార్గం కల్పించినా, ఇవి వైరిపక్షాల వైఖరితో డోలాయమానంగానే మారాయి. కాల్పుల విరమణ ప్రాతిపదికగా తాము వెలువరించిన పది అంశాలపై నిర్థిష్టంగా అమెరికా ప్రతినిధి బృందం చర్చకు రావాల్సిందే అని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇక హెజ్‌బోల్లాపై తమ దాడులను ఆపేది లేదని, ఈ చర్చలకు వీటికి సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే తమ మిత్రపక్షం అయిన హెజ్‌బోల్లాపై దాడులను సహించేది లేదని, వాటిని నిలిపివేయాల్సిందే అని ఇరాన్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
లెబనాన్ అంశమే కీలకం
లెబనాన్ అంశమే ఇప్పుడు కాల్పుల విరమణకు కీలక విషయం అయింది. పూర్తి స్థాయిలో శాంతిస్థాపన జరగాలంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా నిలిచిపోవాలని ఇరాన్ చెపుతోంది. అయితే ఇజ్రాయెల్ ఈ లింక్ కుదరదని స్పష్టం చేస్తోంది. ఇప్పటి కాల్పుల విరమణ ప్రక్రియకు హెజ్‌బోల్లాపై తమ దేశ దాడులకు ఎటువంటి సంబంధం లేదని నెతన్యాహూ ముందు తెలిపినా తరువాత లెబనాన్‌తో చర్చలకు అమెరికా వేదికగా అంగీకరించారు. ఇక మధ్యవర్తిగా పాకిస్థాన్ ఉండటంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పాక్ మధ్యవర్తిత్వాన్ని తమ దేశం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ ఇజ్రాయెల్‌ను దుష్టశక్తి, మానవాళికి శాపం అని తిట్టిపోస్తూ వ్యాఖ్యలకు దిగడం తరువాత వీటిని ఉపసంహరించుకోవడం కీలక పరిణామాలు అయ్యాయి. ఇజ్రాయెల్ పట్ల పాకిస్థాన్ ద్వేషం ఏమిటనేది తెలిసిందని, ఇక ఈ దేశ మధ్యవర్తిత్వాన్ని తాము ఏ విధంగా అంగీకరిస్తామని నిరసనకు దిగారు. ఇక శాంతి చర్చల్లో పాకిస్థాన్ ఏ మేరకు సమతూకత పాటిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. తటస్థదేశంగా వ్యవహరించగలదా? చర్చలలో ఏదో ఒక పక్షం వైపు మొగ్గుచూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.