
- ప్లాట్లుగా చేసి విక్రయం
- పట్టించుకోని అధికార యంత్రాంగం!
గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు పాగా వేస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను, వెంచర్లలోని కమ్యూనిటీ స్థలాలను మింగేస్తున్నారు. జమ్మిచేడు శివారులోని సర్వే నంబర్ 381లో పది గుంటల ఖరీదైన భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినా, పీఏసీఎస్ స్థలాలను కబ్జా చేసినా అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారిందని, నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యుల హక్కులను కాలరాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణం నడిబొడ్డున రోడ్లు.. ప్లాట్లుగా మార్చి..
గద్వాల టౌన్ నడిబొడ్డున నిబంధనల ప్రకారం వదిలేయాల్సిన 40 ఫీట్ల రోడ్లు సైతం ప్లాట్లుగా మారిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. టౌన్ లోని సర్వే నంబర్ 781/ పి, 786/పి సర్వే నెంబర్లలో గతంలోనే ఎల్పీ నంబర్ 348/ 86 వెంచర్ వేశారు. ఎర్రవల్లి, గద్వాల మెయిన్ రోడ్డు నుంచి 40 ఫీట్ల రోడ్డును వదిలి వెంచర్ వేశారు. కానీ ప్రస్తుతం ఆ ఎల్పీ నెంబర్ పైనే ఆ 40 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చేశారు. సర్వే నెంబర్ 86/పి లో ఎల్పీ నంబర్ 410/7 తో వెంచర్ వేశారు. 78/ఏ,78/బి, 26/బి ప్లాట్లకు వెళ్లే 40 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు.
టౌన్ నడిబొడ్డులో ఈ వెంచర్లు ఉండడంతో ఆ ప్లాట్ లకు మంచి డిమాండ్ ఉన్నది. పాత వెంచర్లలో కేటాయించిన ప్రధాన రహదారులను ఆక్రమించి, ఒక్కో ప్లాటును రూ.50 లక్షల నుంచి 60 లక్షలకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. చివరకు సత్యసాయి స్కూల్ సమీపంలోని 40 ఫీట్ల రోడ్డును ఒక రాజకీయ నాయకుడు ఆక్రమించి ఏకంగా షటిల్ కోర్టు ఏర్పాటు చేసినా, కలెక్టరేట్ ముందున్న సర్వీస్ రోడ్డును కబ్జా చేసి కిరాయిలకు ఇస్తున్నా ఎవరూ ప్రశ్నించకపోవడానికి రాజకీయ పలుకుబడే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లేఅవుట్లలో మాయమవుతున్న ఓపెన్ స్పేస్..
లేఅవుట్లలో సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించే 10 శాతం స్థలాలు (ఓపెన్ స్పేస్) క్రమంగా మాయమవుతున్నాయి. రెండో వార్డులోని సర్వే నంబర్ 721లో ఉన్న 10 శాతం స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్మేయగా, ప్రియదర్శిని కాలేజీ ఎదురుగా ఉన్న పీజేపి కాలువ సర్వే నంబర్ 723/4 724/4 మిగులు స్థలాలను కబ్జా చేశారు. బీరెల్లి చౌరస్తా సర్వేనెంబర్ 740లో వెంచర్ వేయగా అందులో ఉన్న 10 శాతం స్థలాన్ని కొందరు కబ్జా పెట్టి కిరాయిలకు ఇచ్చారు. మిగిలిన ఖాళీ ప్రదేశాలను కూడా ఏదో ఒక సంఘం ముసుగులో కాజేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం అంతా బహిరంగంగా జరుగుతున్నా క్షేత్రస్థాయిలో అడ్డుకునే నాథుడే కరువయ్యారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో విఫలం..
మున్సిపల్ అధికారులు ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల చుట్టూ రక్షణ గోడలు గానీ, ఫెన్సింగ్ వేసి ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే కబ్జాదారులకు అవకాశం చిక్కుతోంది. లేఅవుట్లలోని ఓపెన్ ప్లాట్లు, రోడ్ల మార్కింగ్ పట్ల మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహించడం వల్ల అక్రమార్కులు పక్కా స్కెచ్‌లతో భూములను మింగేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, విచారణ చేపట్టి కబ్జాకు గురైన రోడ్లు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
40 ఫీట్ల రోడ్డు కబ్జాకు గురైన విషయంపై ఫిర్యాదు అందింది. ఎంక్వయిరీ చేస్తున్నాం. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలను కాపాడుతాం. -జానకి రామ్ సాగర్, కమిషనర్, గద్వాల మున్సిపాలిటీ