Reading Time: < 1 minute
Ap Cm Issues Serious Warning To Ministers Over Cabinet Leaks And Agenda Disclosure

CM Chandrababu Serious Warning: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.. దాదాపు 3 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. కేంద్రానికి, ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్‌.. అయితే, ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు.. కీలక సమాచారం లీక్ అవుతున్న అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్‌ అజెండాతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ముందుగానే బయటకు ఎలా వస్తున్నాయంటూ మంత్రులను ప్రశ్నించారు. ఇకపై క్యాబినెట్ సమావేశానికి ముందే ఎజెండా లీకైతే సంబంధిత మంత్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. గతంలో ఇలాంటి లీకుల కారణంగా ఎన్టీఆర్ తన కేబినెట్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Read Also: HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

అదేవిధంగా, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా సీఎం మంత్రులకు పలు సూచనలు చేశారు. ‘జలధార’ పథకం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. పాస్‌బుక్స్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు, సంబంధిత మంత్రులు నెలకు కనీసం నాలుగు సార్లు ప్రాంతాల వారీగా పర్యటించాలని ఆదేశించారు. ‘సూర్య ఘర్’ పథకంపై మరింత దృష్టి పెట్టాలని, వచ్చే ఏడాదితో ముగియనున్న లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని మంత్రులకు నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే మహిళా బిల్లుపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇక, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ఏపీ కేబినెట్‌లో లీకుల అంశంపై సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక జారీ చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.