Reading Time: < 1 minute

విద్యార్థుల హాజరు ప్రక్రియలో మార్పు

ప్రభుత్వ నిర్ణయం

ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో అమలు

ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ‘దోస్త్’ నోటిఫికేషన్ 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలవుతుండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్‌లోనూ అమలు చేయనున్నారు. సంబంధిత విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలకు సర్యులర్ జారీ చేసి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. అనేక డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారి నుంచి భారీమొత్తంలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారా..లేదా..? అనేది అధికారులు పర్యవేక్షించనున్నారు. సచివాలయంలో గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పిఎంయు) సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, వివిధ వర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, ఉన్నతాధికారులు పాల్గొని డిగ్రీ కోర్సులలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఈ నెల 13వ తేదీన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం నిర్వహించి కొత్త కోర్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసే ఆవకాశం ఉంది.