
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ గాయకుడు వి. రామకృష్ణ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సంగీతం కెరీర్‌లోని మధుర స్మృతులతో పాటు చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న కాలంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. రామకృష్ణ తన కెరీర్ ఆరంభంలో పెండ్యాల నాగేశ్వరరావు, ఎస్. రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి లాంటి గొప్ప సంగీత దర్శకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని తెలిపారు. “ఈ పాట రామకృష్ణే పాడాలి” అని వారు పట్టుబట్టి తనకు అవకాశాలు ఇచ్చారని, తన ప్రతిభను వారు మనస్ఫూర్తిగా గుర్తించారని ఆయన కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నారు.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
అయితే, ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పి. సుశీల లాంటివారు మద్దతు ఉన్నప్పటికీ, తెర వెనుక తనను తొక్కేసే ప్రయత్నాలు జరిగాయని ఆయన వివరించారు. తాను పాడిన పాటలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించి, ఇతర గాయకులతో మళ్ళీ పాడించేవారని చెప్పారు. కనీసం ఆ పాటను సరిదిద్దుకునే అవకాశం కూడా తనకు ఇచ్చేవారు కాదని తెలిపారు. తాను అందుబాటులో ఉన్నప్పటికీ, “రామకృష్ణ ఊళ్లో లేడు, ప్రోగ్రామ్స్‌లో బిజీగా ఉన్నాడు” అని తప్పుడు ప్రచారం చేసి తన వరకు వచ్చే అవకాశాలను కొందరు దూరం చేశారని వెల్లడించారు. రికార్డింగ్ సమయంలో కొంతమంది సంగీత దర్శకుల ముఖ కవళికల్లోనే తన పట్ల నిరాదరణ కనిపించేదని, “ఏదోలే పాడు” అన్నట్లుగా వారు వ్యవహరించేవారని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగానని, ఆ ఒడిదుడుకులే తనను మరింత దృఢంగా మార్చాయని ఆయన స్పష్టం చేశారు. ఒక గొప్ప గాయకుడి విజయ ప్రస్థానం వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని ఆయన మాటల ద్వారా తెలిసింది.
ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?