
నటసింహం నందమూరి బాలకృష్ణ, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అలవాట్లపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలోని వైరల్ ట్రైన్ సీన్‌పై ఆయన సరదాగా మాట్లాడారు. “తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి?” అని తనను కొందరు తెలిసినవాళ్లు అడుగుతారని.. అప్పుడు నాకూ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుందని చెప్పారు. షూటింగ్ సమయంలో అప్పటి వాతావరణంలో.. ఆ పాత్ర మూడ్‌లో ఉన్నప్పుడు అనిపించకపోయినా, తర్వాత ప్రేక్షకుల స్పందన చూసినప్పుడు అసలు ఇది ఎలా చేశాం అని అనిపించినట్లు చెప్పారు. అసలు రైటర్స్ ఎందుకు అలా రాశారో, నేను ఎందుకు ఒప్పుకున్నాడో, దర్శకుడు ఎలా తీశాడో.. ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ప్రస్తుత చిత్రాలలో డైలాగులు, మేనరిజమ్స్‌లో సహజత్వం వైపు మొగ్గు చూపుతున్నామని, అయితే తన డైలాగులు ఎప్పుడూ అర్థవంతంగా ఉంటాయని స్పష్టం చేశారు.
బాలకృష్ణ తన వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా ప్రస్తావించారు. తన గొంతు కోసం పొద్దున్నే లేవగానే చుట్ట కాల్చే అలవాటు ఉందని చెప్పారు. ఉదయం 3:30 గంటలకు లేవగానే చుట్టతోనే తన రోజు ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే, తనకు టీ అలవాటు ఉందని, ముఖ్యంగా సాయంత్రం 4:30 గంటలకు ఒక టీ తప్పనిసరి అని, కాఫీ అలవాటు లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. తాను చెన్నైలో పుట్టానని, తమిళనాడు తన పుట్టిన ఊరు అని, అయితే ఆంధ్ర నాడు తన జీవనాడు అని తెలిపారు. పది మందిని మీడియా ద్వారా లేదా సాహిత్యపరంగా ఎంటర్‌టైన్ చేయడం తనకు ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా తనది కల్మషం లేని మనసు అని.. బాలయ్య మరోసారి నిరూపించుకున్నారు.
ఇక పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలతో పాటు అన్ని రకాల జోనర్లలో నటించానని, తన తండ్రి ఎన్. టి. రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ పాత్రలను పోషించానని తెలిపారు. దర్శకులతో కలిసి పని చేసేటప్పుడు కేవలం కథ లేదా పంచ్ డైలాగులు మాత్రమే కాకుండా, దర్శకుడిపై వ్యక్తిగత నమ్మకం, అతని పని పట్ల ఉండే తపనను కూడా పరిగణనలోకి తీసుకుంటానని బాలకృష్ణ వివరించారు.
Also Read: ఇప్పుడు మీరు చూస్తున్న రాజశేఖర్ వేరు.. ఒకప్పుడు రాజశేఖర్ వేరు..