
హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీమ్ ఫాంహౌస్ నిర్మించుకున్నాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫాంహౌస్ కేంద్రంగా ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డాడు ముఖీమ్ అని అన్నారు. ఐలాపూర్ లో హైడ్రా కూల్చివేతలపై రంగనాధ్ వివరణ ఇచ్చారు. ఐలాపూర్ లో భూములపై 1998 లో హైకోర్టు స్టేటస్ కో ఉందని, 2006 లో నిర్మించిన ఫాంహౌస్ ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడని తెలియజేశారు. 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నాడని, ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నాడని విమర్శించారు. ముఖీమ్ 100 గజాలకు రూ.10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ముఖీమ్ భూ అక్రమణలకు పాల్పడ్డాడని మండిపడ్డారు. ఐలాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ధ్వజమెత్తారు.