Reading Time: < 1 minute

బీరుట్ : లెబనాన్‌లో సెంట్రల్ బీరుట్, ఇతర ప్రాంతాల్లో బుధవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దాదాపు 254 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. వెయ్యిమందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్, లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లాకు గత ఐదు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఒకే రోజు ఇన్ని మరణాలు సంభవించడం చాలా ఎక్కువని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది.

ఇజ్రాయెల్ మిలిటరీ తాము హెజ్‌బొల్లా నివాసాలనే లక్షంగా చేసుకున్నామని ప్రకటించింది. అయితే బుధవారం మధ్యాహ్నం జనం రద్దీగా ఉన్న వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడంతో పౌరులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ అయోన్ ఈ దాడి కిరాతకమైన చర్యగా విమర్శించారు.