Reading Time: < 1 minute

 హీరో, టివికె నేత విజయ్ సినిమా జననాయగన్ విడుదలకు ముందే ఐదు నిమిషాల నిడివి సీన్లు లీక్ కావడం దుమారం రేపింది. ఆన్‌లైన్‌లో శుక్రవారం సినిమా క్లిప్స్ వాట్సాప్, టెలిగ్రామ్‌లలో కన్నించాయి. ఈ అంశంపై సినిమా నిర్మాతలు కెవిఎన్ ప్రోడక్షన్స్ వారు వెంటనే స్పందించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే తమ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బయటకు వచ్చాయని, వీటిని ఎవరో అక్రమంగా సేకరించి, దురుద్ధేశపూరితంగా ఆన్‌లైన్‌లో పెట్టారని, ముందు కొంత మేరకే లీక్ అయిందని అనుకున్నామని నిర్మాతల తరఫు న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం తెలిపారు. అయితే సినిమా మొత్తానికి సంబంధించి లింక్‌లు తరువాత వెలుగులోకి వచ్చాయని స్పందించారు. ఈ పైరసి చర్యకు వ్యతిరేకంగా నిర్మాతలు చట్టపరమైన చర్యలకు దిగారు. కారకులు కొందరిని గుర్తించామని తెలిపారు. ప్రతి సినిమాను ఎంతో భావోద్వేగంతో తీస్తారని,

వందలాది మంది సినీ కార్మికుల నెత్తురు చెమట చిందిస్తారని , దీనిని నీరుగార్చే ఈ విధమైన పైరసీలను నిలిపివేయాలని నటుడు శివకార్తికేయన్ తీవ్రంగా స్పందించారు. సినిమా నిర్మాతలు, పంపిణీదార్లు వెంటనే చెన్నైలోని ప్రాంతీయ సెన్సార్ అధికారితో మాట్లాడారు. తక్షణం ఈ అంశంపై స్పందించాలని కోరారు. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖతో మాట్లాడేందుకు ఆయన అంగీకరించారని, క్లిప్పులు లింక్‌ల తొలిగింపునకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ చిట్టచివరి చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కావల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో సినిమా వాయిదాపడుతూ వచ్చింది. విడుదల కాని ఈ సినిమా సన్నివేశాల లీక్‌పై పలువురు చిత్రప్రముఖులు స్పందించారు. ఇటువంటి పైరసీలతో చిత్ర పరిశ్రమ దెబ్బతింటుందని అగ్రశ్రేణి నటులు, నిర్మాతలు, దర్శకులు, పంపిణీదార్లు విమర్శించారు.