Reading Time: < 1 minute

ఐపిఎల్-2026లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ గురువారం జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. కెకెఆర్ విధ్వంసకర ఆటగాడు ఫిన్‌ ఆలెన్ ఔట్ అయిన తీరు చర్చనీయాంశంగా మారింది. లక్నో ఆటగాడు దిగ్వేశ్ రాఠీ బౌండరీ వద్ద ఆలెన్ క్యాచ్‌ని అందుకున్నాడు.. కానీ, అతను బౌండరీని తాకాడని కోల్‌కతా అభిమానులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఔట్‌గా ప్రకటించడం కోసం థర్డ్ అంపైర్ సహాయం తీసుకోకుండా ఫీల్డ్ అంపైర్లే తుది నిర్ణయాన్ని ప్రకటించడం.. కెకెఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. దీనిపై కెకెఆర్ అటగాడు రోవ్‌మన్ పావెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. అంపైర్లు కాస్త నిశితంగా పరిశీలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

‘‘అవును.. కచ్చితంగా మరింత నిశితంగా పరిశీలిస్తే బాగుండేది. ఫిన్ ఆలెన్ ఔటై డగౌట్‌కు వచ్చాక మాట్లాడుకున్నాం. ఐపిఎల్‌లోని ప్రతి చిన్న విషయానికి థర్డ్ అంపైర్‌ని ఆశ్రయిస్తారు. కానీ, ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇది అంపైర్ల పొరపాటే. అయితే మా ఓటమికి ఇది కారణమని చెప్పడం లేదు. హోం గ్రౌండ్‌లో రెండు పాయింట్లు కోల్పోవడం నిరుత్సాహానికి గురి చేసింది. భారీగా ప్రేక్షకులు మద్ధతుగా నిలిచిన మైదానంలో ఓడిపోయాం. ఇక్కడ గెలిస్తే ఆ అనుభూతే వేరే. కానీ, అలా జరగలేదు. మేం 180+ స్కోర్ చేసినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తామని భావించాం. కానీ, యువ క్రికెటర్ ముకుల్ చౌదరికే ఈ క్రెడిట్ దక్కుతుంది. అద్భుతంగా ఆడాడు’’ అని పావెల్ పేర్కొన్నాడు.