
బెంగళూరు: ప్రభుత్వ టీచర్‌తో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకొని అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా బాల్కి తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వంజార్ ఖేడ్ గ్రామంలో జ్యోతి కపాళే (57) అనే మహిళ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కలబుర్గి జిల్లాలోని కల్మూడ గ్రామంలోని తన పుట్టింటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఈ క్రమంలో అమర్ అనే యువకుడు పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. జ్యోతి వద్ద అమర్ రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పలుమార్లు డబ్బులు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేస్తుండడంతో సదరు పంతులమ్మను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులు ఇస్తానని నమ్మించి ఆమెను కల్మూడ గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను చంపేసి మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాల్ హిస్టరీ ప్రకారం అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.