Reading Time: 2 minutes

బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వాడటం మానేసింది.. నెలలో రూ.5వేలు సేవ్ చేసింది: కిరాణా కొట్టే బెస్ట్ అంటున్న మహిళ

Caption of Image.

ఈ రోజుల్లో మనకు ఏదైనా కావాలంటే కేవలం ఒక టాప్ చేస్తే చాలు.. జస్ట్ 10 నిమిషాల్లో ఇంటి ముందు ఉంటుంది. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి యాప్స్ మన జీవితంలో ఎంతగా కలిసిపోయాయంటే.. అసలు మనం వాటికి ఎంత బానిసయ్యామో కూడా గుర్తించలేనంతగా. ఒక మహిళ తన అనుభవంలో ఈ యాప్స్‌ను ఒక నెల రోజులు వాడటం మానేస్తే ఏం జరిగిందో వివరిస్తూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. చాలా మంది కావాలని క్విక్ కామర్స్ యాప్స్ వాడకానికి అలవాటు పడకపోయినా.. దాని వల్ల జరుగుతున్న ఆర్థిక, ఆరోగ్య నష్టాల గురించి ఆమె మాటల్లో తెలుసుకుందాం..

మినిమం ఆర్డర్ ‘ట్రాప్’..
మొదట్లో ఆమె గమనించిన ప్రధాన విషయం మినిమం ఆర్డర్ వాల్యూ. కేవలం ఒక ప్యాకెట్ పాలు లేదా కొంచెం కొత్తిమీర కావాల్సి వచ్చినా.. డెలివరీ ఛార్జీలు పడకూడదని రూ.60 ఆర్డర్‌ను కాస్తా బలవంతంగా రూ.200 వరకు పెంచాల్సి వచ్చినట్లు చెప్పారు. దీని వల్ల అవసరం లేకపోయినా ఒక చాక్లెట్, ఏదో ఒక స్నాక్ ఐటెమ్ యాడ్ చేయడం ఆమెకు అలవాటుగా మారిందట. ఇలా రోజూ అదనంగా పెట్టే వంద రూపాయలు నెల తిరిగేసరికి ఏకంగా రూ.4వేల నుండి రూ.5వేల 500 వరకు భారం పడుతోందని ఆమె గుర్తించింది. యాప్స్ డిలీట్ చేసి.. నేరుగా ఇంటి దగ్గరలోని కిరాణా షాపుకు వెళ్లినప్పుడు కేవలం కావాల్సిన వస్తువుపైనే ఖర్చు పెట్టడం వల్ల భారీగా ఆదా అయినట్లు వెల్లడించారు.

మర్చిపోయిన నడక.. 
యాప్స్ వల్ల ఇంటి గడప దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనివల్ల శారీరక శ్రమ సున్నాగా మారిందని ఆమె గుర్తించారు. యాప్స్ వాడటం మానేసి కూరగాయల కోసం సంతకు వెళ్లడం, పాల కోసం నడక సాగించడం వల్ల తెలియకుండానే శరీరానికి వ్యాయామం దొరికిందని చెప్పారు. జిమ్‌కు వెళ్లకపోయినా.. ఈ చిన్న చిన్న నడకలు తనను హెల్తీగా ఉంచుతున్నాయని పేర్కొంది. స్వయంగా వెళ్లి కూరగాయలు ఏరుకోవడంలో ఉండే ఆ తృప్తి.. యాప్‌లో చూసి ఆర్డర్ చేయడంలో లేదని చెప్పారు.

అదుపులో క్రేవింగ్స్.. 
అర్ధరాత్రి ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే.. ఫోన్ తీయగానే అందుబాటులో క్విక్ డెలివరీ సౌకర్యం ఉండటం వల్ల మనం మన మనసుతో పోరాడటం మానేస్తాం. కానీ యాప్స్ లేకపోవడంతో.. ఆ క్షణం కలిగే కోరికలను అదుపు చేసుకోవడం సాధ్యమైందని ఆమె చెప్పారు. దీనివల్ల అనవసరమైన క్యాలరీల నుంచి తప్పించుకుంటున్నారు చెప్పారు. అంతేకాకుండా ఆర్డర్ ఎప్పుడైనా చేయొచ్చు కదా అన్న నిర్లక్ష్యం పోయి, మళ్లీ పాత పద్ధతిలో కిరాణా సరుకులను చీటీగా రాసుకోవడం, ముందుగానే మీల్స్ ప్లాన్ చేసుకోవడం అలవాటైందని వెల్లడించారు.

యాప్స్ అవసరమే.. కానీ..
మెుత్తానికి నిమిషాల్లో అన్నీ డెలివరీ చేసేస్తున్న క్విక్ కామర్స్ యాప్స్ చెడ్డవని ఆమె అనడం లేదు. ఇవి సమయాన్ని ఆదా చేస్తాయి.. అత్యవసర సమయాల్లో ఆదుకుంటాయి. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి తప్ప అలవాటుగా మార్చుకోకూడదని ఆమె హెచ్చరిస్తోంది. ఒక నెల పాటు జరిగిన ఈ డిజిటల్ డిటాక్స్ ఆమెకు డబ్బును మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా మిగిల్చిందట. ఇప్పుడు ఆమె మళ్లీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసినా.. గతంలో లాగా గుడ్డిగా కాకుండా చాలా జాగ్రత్తగా, అవసరానికి తగినట్లుగా మాత్రమే వాడుతోంది.

©️ VIL Media Pvt Ltd.