
అసోంలో 85.04% పోలింగ్ 2021లో నమోదైన
రికార్డుస్థాయి పోలింగ్ కన్నా ఎక్కువ
కేరళంలో 77.38% నమోదు
పుదుచ్ఛేరిలో రికార్డు స్థాయిలో 89.08% ఓటింగ్
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 296 నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన ఓటింగ్ గణాంకాలు చూస్తే, పుదుచ్చేరిలో అత్యధికంగా 89.08శాతం పోలింగ్ నమోదు కాగా, అస్సాంలో 85.04శాతం, కేరళలో 77.38శాతం ఓటింగ్ నమోదైంది.
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గం టల వరకూ రికార్డు స్థాయిలో 85.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2021లో నమోదైన 82.04 శాతాన్ని మించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ దశాబ్దం తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 94.57 శాతం ఓటింగ్ నమోదవగా, అమ్రి నియోజకవర్గంలో కనిష్ఠంగా 70.40 శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 జిల్లాల్లోని 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 6 గంటల వరకూ 77.38 శాతం పోలింగ్ నమోదై, 2021లో నమోదైన 74.06 శాతాన్ని మించింది.
పుదుచ్చెరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ కూడా సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 89 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్‌డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి స్థానిక స్వయం పాలన, పరిపాలనా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని పోటీ చేస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ప్రజల్లో ఎన్నికలపై ఉన్న ఆసక్తిని, రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.