Reading Time: < 1 minute

పామునైనా నమ్మొచ్చు.. బీజేపీని నమ్మలేం: సీఎం మమతా బెనర్జీ

Caption of Image.

టెంటూలియా(బెంగాల్): అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీకి నమ్మకం లేదని, అందుకే బయటి వ్యక్తులను అక్కడికి తరలించిందని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని టెంటూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 50 వేల మందిని ఒక రైలులో అస్సాంకు తరలించారన్నారు. ఇదే వ్యూహాన్ని బెంగాల్‌‌లో కూడా అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే ఇక్కడి అధికారులను బదిలీ చేయిస్తోందని మండిపడ్డారు. 

బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలను కొనేసిందని, ప్రస్తుతం ఏ సంస్థ కూడా స్వతంత్రంగా పని చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పామునైనా నమ్మొచ్చు.. కానీ బీజేపీని నమ్మలేమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌‌లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో 90 లక్షల మంది పేర్లను తొలగించారని, వీరిలో 60 లక్షల మంది హిందువులు, 30 లక్షల మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు. 

అస్సాం ఎన్ఆర్​సీలో కూడా 19 లక్షల మంది పేర్లు తొలగిస్తే, వారిలో 13 లక్షల మంది హిందువులే ఉన్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని హెచ్చరించారు. బిహార్‌‌లో చేపలు తిననివ్వడం లేదు, అందుకే అవి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

అమిత్ షా రాజీనామా చేయాలి

బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరుగుతున్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలను మమతా బెనర్జీ తిప్పికొట్టారు. సరిహద్దులను కాపాడాల్సింది కేంద్ర బలగాలేనని, చొరబాట్లు జరిగితే దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజైన్​ చేయాలని డిమాండ్ చేశారు.

నేనే అభ్యర్థిని అనుకొని ఓటేయండి

రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థిగా తననే భావించాలని ఓటర్లకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ‘నా నాయకత్వంలో టీఎంసీ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటే, ప్రతి సీటులోనూ నేనే అభ్యర్థిని అనుకొని ఓటేయండి’ అని పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.