
గల్ఫ్ ప్రాంతంలో గత నెల కొనసాగిన యుద్ధ వాతావరణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సామాన్య ఇన్వెస్టర్లు భయపడి వెనక్కి తగ్గుతారని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుంది. గత మార్చి నెలలో భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లు కుప్పకూలుతున్నా.. SIP ద్వారా పెట్టుబడులు పెట్టడంలో ఏమాత్రం వెనకాడలేదు. మార్చి నెలలో ఎస్ఐపీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.32వేల 087 కోట్లకు చేరుకున్నాయి. ఇది ఫిబ్రవరి నెలతోని రూ.29వేల 845 కోట్లతో పోలిస్తే దాదాపు 7.5 శాతం పెరుగుదల.
ఫిబ్రవరిలో పెట్టుబడులు స్వల్పంగా తగ్గడానికి క్యాలెండర్ కారణాలే తప్ప ఇన్వెస్టర్ల ఉత్సాహం తగ్గడం కాదు. ఫిబ్రవరిలో రోజులు తక్కువగా ఉండటం.. చివరి రోజు బ్యాంకు సెలవు కావడంతో దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర ఆటో-డెబిట్ లావాదేవీలు మార్చి నెలలోకి యాడ్ అయ్యాయి. అయితే మార్చి నెలలో సెన్సెక్స్ 11.5 శాతం, నిఫ్టీ 11.3 శాతం మేర నష్టపోయినప్పటికీ.. ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్ పతనాన్ని ఒక అవకాశంగా భావించి పెట్టుబడులు పెంచారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 10 శాతానికి పైగా పడిపోయిన సమయంలో.. తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించారు.
ఇన్వెస్టర్ల సంఖ్య పరంగా ఫిబ్రవరిలో 9.44 కోట్లుగా ఉన్న యాక్టివ్ ఎస్ఐపీ ఖాతాలు మార్చి నాటికి 9.72 కోట్లకు పెరిగాయి. అయితే ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. మార్చిలో కొత్తగా 52.82 లక్షల ఎస్ఐపీలు ప్రారంభమవగా.. 53.38 లక్షల ఎస్ఐపీలు రద్దయ్యాయి లేదా మెచ్యూరిటీకి వచ్చాయి. దీనివల్ల స్టాపేజ్ రేషియో 101 శాతానికి చేరింది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల కొందరు ఇన్వెస్టర్లు ఆందోళనతో తమ పెట్టుబడులను నిలిపివేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.
ALSO READ : ఇరాన్ యుద్ధానికి బ్రేక్.. లాభాల్లో క్రిప్టోలు
మరోవైపు.. మార్కెట్ నష్టాల ప్రభావం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువపై స్పష్టంగా కనిపించింది. ఫిబ్రవరిలో రూ.16లక్షల 64వేల కోట్లుగా ఉన్న ఎస్ఐపీ ఆస్తుల విలువ.. మార్చిలో రూ.15లక్షల11వేల కోట్లకు పడిపోయింది. మార్కెట్ పతనమే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఎస్ఐపీల వాటా 20.5 శాతానికి చేరడం గమనార్హం. యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం భారత ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.