Reading Time: < 1 minute

అమరావతి: భూవివాదంలో ఓ న్యాయవాదిని హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో యడవల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఒంగోలులో హరిప్రసాద్ అనే న్యాయవాది భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. హరి ప్రసాద్ జిల్లా కోర్టులో లాయర్‌గా పని చేస్తున్నాడు. ఒంగోలులోని కేశవరాజుకుంట సమీపంలో ఓ భూమిలో పోతరాజు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి నివసిస్తున్నాడు. రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఆ స్థలం తనదని వాదిస్తున్నాడు. తన భూమిని ఆక్రమించరంటూ విఆర్‌ఒతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేంద్రరావు స్థానిక నాయకులతో కలిసి పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు.

దీంతో పోలీసులు పోతరాజుతో పాటు ఆయన బంధువైన న్యాయవాది హరిప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో హరి ప్రసాద్ ఒక వీడియోను విడుదల చేయడంతో వైరల్‌గా మారింది. స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన కొందరు బెదిరిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ఎంఎల్‌ఎను కోరారు. గురువారం ఉదయం హైకోర్టుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి స్కూటీపై వెళ్లాడు. హరి ప్రసాద్‌ను కొట్టి చంపి అనంతరం అతడిపై ద్విచక్రవాహనాన్ని పడేశారు. అతడిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ భూవివాదంలోనే అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.