
రాష్ట్ర హైకోర్టు వాహనదారులకు ఊరటనిచ్చేలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల్లో ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, పోలీసులు వారి వాహనాన్ని సీజ్ చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినంత మాత్రాన మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. డంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లపై దాఖలయిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఈవి వేణుగోపాల్‌రావు ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయితే, ఆ సమయంలో అతనితో పాటు ఉన్న మద్యం తాగని స్నేహితులకు లేదా బంధువులకు వాహనాన్ని అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అక్కడ ఎవరూ లేని పక్షంలో సదరు వ్యక్తికి సంబంధించిన బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఒకవేళ ఎవరూ వాహనం తీసుకెళ్లడానికి రాకపోతే మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనల ప్రకారం డ్రైవర్‌పై చలానా వేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రమే చేయాలని, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించకూడదని ధర్మాసనం తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటూ రోడ్డుపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, చట్టం పరిధిలో ఉన్న అధికారాలను మాత్రమే వినియోగించుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే మద్యం తాగుతూ వాహనాలు నడిపి పట్టుబడిన అనేక సందర్భాల్లో పోలీసులు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనం సీజ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు ఈ స్పష్టత ఇచ్చింది.