Reading Time: < 1 minute

మీ యుద్ధ రక్త దాహానికి బలైన చిన్నారులు వీళ్లే : 168 ఫొటోలు, స్కూల్ బ్యాగులతో చర్చలకు వచ్చిన ఇరాన్..

Caption of Image.

అమెరికాతో శాంతి చర్చల కోసం వెళ్తున్న ఇరాన్ బృందం ఒక ప్రత్యేకమైన విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకుంది. ఇటీవలి యుద్ధంలో జరిగిన ఒక ఘోర విషాదానికి గుర్తుగా ఆ విమానానికి “మినాబ్-168” అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న షజారే తయ్యేబే అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో 168 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారు. వారి జ్ఞాపకార్ధంగా  ఇరాన్ అధికారులు ఈ విమానాన్ని ఎంచుకున్నారు.

అమెరికా ఇరాన్ చర్చల కోసం పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్, విమానం లోపల ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫోటోలో విమానం సీట్లలో చనిపోయిన నలుగురు పిల్లల ఫోటోలు,  పిల్లల స్కూల్ బ్యాగులు, పువ్వులు ఉన్నాయి. వీరే నా తోటి ప్రయాణికులు అని ఆయన ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.

►ALSO READ | పాకిస్తాన్ చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలు.. ఇస్లామాబాద్‎లో హై అలర్ట్

ఈ దాడికి అమెరికా సైన్యమే కారణమని ఇరాన్ అంటుండగా… ఇది పొరపాటున జరిగి ఉండవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ అధికారులతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్  చేరుకుంది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘించారని ఇరు దేశాలు ఆరోపించగా… హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడంపై అమెరికా ఆశతో ఉండగా…. తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగిస్తేనే ముందడుగు వేస్తామని ఇరాన్ చెబుతోంది.

ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా  పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు పెరిగాయి. దింతో వస్తువుల ధరలు పెరిగి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న చర్చలు సఫలమైతేనే శాంతి నెలకొనే అవకాశం ఉంది.
 

©️ VIL Media Pvt Ltd.