Reading Time: 2 minutes

పెట్రోల్ అయినా.. డీజిల్ అయినా రోజుకు వెయ్యి రూపాయలకే: రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో రేషన్

Caption of Image.

పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. కావాల్సినంత ఉందని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తుంది. జనం హైరానా పడొద్దు.. నిల్వ చేసుకోవద్దు అంటూ భరోసా ఇస్తుంది. ఇలాంటి టైంలో జియో.. బీపీ భాగస్వామ్యంతో నడుస్తున్న రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో రేషన్ విధానం తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ కొట్టటం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. 

ఒక రోజుకు.. ఒక కస్టమర్ కు వెయ్యి రూపాయలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ పోస్తాం అని బంకులు చెబుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. పెట్రోల్ అయినా కొట్టించుకో.. డీజిల్ అయినా కొట్టించుకో.. రోజుకు వెయ్యి రూపాయలు మాత్రమే పోస్తాం అని రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో రేషన్ విధానం తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలకు కలిపి లక్షా 2 వేల పెట్రోల్ బంకులు ఉంటే.. ఇందులో 2 వేల బంకులు రిలయన్స్ కంపెనీవి.

గ్లోబల్ మార్కెట్‌లో యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆయిల్ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో నడుస్తున్న సుమారు 2వేలకు పైగా ‘జియో-బీపీ’ పెట్రోల్ పంపుల్లో ఇంధన విక్రయాలపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రేషనింగ్ విధానాన్ని బంకులను నడిపిస్తున్న డీలర్లు పాటిస్తున్నారు. కంపెనీ మాత్రం రేషనింగ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదంటూ స్పందించింది. 

రేషనింగ్ విధానం ప్రకారం.. ప్రస్తుతం ఒక కస్టమర్ ఒక విడతలో కేవలం రూ.వెయ్యి విలువైన పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి విధించినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా స్టాక్ అయిపోతుందనే భయంతో జనం ఎగబడటంతో పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోకుండా చూడటమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి పాక్షికంగా మూతపడటమే. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినప్పటికీ.. సముద్ర మార్గంలో ట్యాంకర్ల రాకపోకలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా వర్గీకరించడంతో సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రిలయన్స్ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా పంపుల వద్ద ఈ రేషనింగ్ అమలు అవుతోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం రిలయన్స్ మాత్రమే కాదు.. నయారా ఎనర్జీ వంటి ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా నష్టాలను తగ్గించుకోవడానికి ఇప్పటికే ధరలను పెంచేశాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం పంపుల వద్ద కూడా అక్కడక్కడ రూ.వెయ్యి పరిమితి అమలవుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. కేంద్ర చమురు శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం పెట్రోల్ లీటరుపై రూ.24.40, డీజిల్‌పై ఏకంగా రూ.104.99 మేర రిటైలర్లు నష్టపోతున్నారు. దీనికి తోడు సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలపై దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒకవేళ యుద్ధం మళ్లీ తీవ్రమైతే.. ఈ ఇంధన ఆంక్షలు మరిన్ని రోజులు కొనసాగే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా అనవసరపు ప్రయాణాలను తగ్గించుకోవాల్సిన సమయం ఇదని నిపుణులు అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.