
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎన్నికల హామీలను ప్రజల ముందుంచారు. కోల్‌కతాలో శుక్రవారం విడుదల చేసిన పార్టీ సంకల్ప పత్రాన్ని ఆయన స్పష్టమైన సిద్ధాంతాత్మక అజెండాగా మలుస్తూ, ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, బెంగాల్ కుమారుడునే ముఖ్యమంత్రిగా నియమించడం, రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన వంటి హామీలను ప్రకటించారు. సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బెంగాల్‌లో ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉంటుంది అని షా స్పష్టం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలకు సమాధానంగా,
ఇది బీజేపీ ఆలోచన కాదని, రాజ్యాంగ సభ సిఫారసు అని తెలిపారు. ప్రతి పౌరుడిని మతం ఆధారంగా కాకుండా సమానంగా చూడాలన్నది రాజ్యాంగ సూత్రం. ఒకరికి నాలుగు పెళ్లిళ్లు, మరొకరికి ఒక్కటి అనుమతించడం సమానత్వమా? అని ప్రశ్నించారు. బెంగాల్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందిస్తూ, తమ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు దూరమని షా పేర్కొన్నారు. దీదీ తర్వాత ఆమె మేనల్లుడు నాయకుడవుతాడనే విధానం మా వద్ద లేదు అని అభిషేక్ బెనర్జీపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి బెంగాల్‌కు ముఖ్యమంత్రి బెంగాల్‌కు చెందినవారే అవుతారు. ఆయనకు పరిపాలనా సామర్థ్యం, అర్హత ఉండాలి అని తెలిపారు.
రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడిపించాలనే ఆరోపణలను ఖండిస్తూ, బెంగాల్‌ను ఢిల్లీ నుంచి పాలించం. కానీ ఢిల్లీ నుంచి పాలించడం కన్నా బంగ్లాదేశ్ ప్రభావం ఉండటం మరింత ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ చొరబాటుదారుల అంశం మరోసారి ముందుకు వచ్చింది. చొరబాటుదారులు, శరణార్థుల మధ్య తేడాను స్పష్టం చేస్తూ, భారత పౌరులు కాని వారే చొరబాటుదారులు. వారిని బయటకు పంపిస్తాం. శరణార్థులకు పౌరసత్వం ఇస్తాం అని షా తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొరబాటుదారులపై వైట్ పేపర్ విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఇక టీఎంసీ నేత అఖిల్ గిరి చేసిన రామ రాజ్యం అవసరం లేదు అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, రామ రాజ్యం అంటే మంచి పరిపాలన. స్వాతంత్య్ర సమర కాలంలో మహాత్మా గాంధీ కూడా ఇదే పాలనను ప్రస్తావించారు అని షా పేర్కొన్నారు.