Reading Time: 2 minutes

కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ మాఫియాకు అడ్డాగా మారిందంటూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నాదర్‌గూల్ భూములపై ప్రభుత్వం కుట్రలు చేస్తున్నందంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్‌ఎస్ బృందం జిల్లా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలసి నాదర్‌గూల్ భూ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాదర్‌గూల్ సర్వే నెంబర్ 613లో గల 373 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కబ్జాకు గురవుతోందంటూ వారు ఫిర్యాదు చేశారు. సదరు భూమిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సబిత మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గూల్ రెవెన్యూ పరిధిలోని 613 సర్వే నెంబర్‌లో గల 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు.

హైకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే కొందరు అక్రమార్కులు ఈ భూములను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుమారు 600 మంది రైతులు మూడు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఈ భూముల్లో రౌడీలు, గూండాలను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నేతలు దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. పేదోళ్ల గుడిసెలపై బుల్డోజర్‌లతో విరుచుకుపడే హైడ్రాకు రూ.7 వేల కోట్ల విలువ చేసే 373 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా కన్పించడం లేదా అంటూ ఆమె మండిపడ్డారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ల హయాంలో ప్రభుత్వ భూములను పరిరక్షించే యత్నం జరిగిందని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి భూ దోపిడీకి తెరతీశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా బౌన్సర్లు,

గూండాలను అడ్డుపెట్టి రైతులను బెదిరించి బ్లూ షీట్స్ వేసి కండ్లముందే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములు ప్రభుత్వానివా లేక ప్రైవేటువా అన్న విషయం తక్షణమే నిగ్గుతేల్చాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములను కబ్జా చెర నుంర విడిపించేంతవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేష్, గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.