
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత రాజకీయాల్లోకి అడుగుపెడుతూ నటించిన చివరి చిత్రం’జన నాయగణ్’ (Jana Nayagan). ఎన్నో అంచనాలతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్, కోర్టు చిక్కులతో వాయిదా పడింది. రాజకీయ కారణాలతోనే తన మూవీ రిలీజ్ కాకుండా అడ్డుకున్నారంటూ విజయ్ కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయినా విడుదల అవుతుందని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లలోకి రాకముందే సినిమా మొత్తం పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవ్వడం చిత్ర యూనిట్‌ను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
లీక్ వెనుక కుట్ర ఉందా?
గత కొన్ని నెలలుగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసులు వెరసి సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, అది కూడా HD క్వాలిటీతో సినిమా లీక్ అవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికే ఇలా చేశారా? అని ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దర్శకుడు భావోద్వేగం
దర్శకుడు హెచ్. వినోద్ ఈ ఘటనపై అత్యంత భావోద్వేగంతో స్పందించారు. ప్రతి సీన్ వెనుక ఎంతోమంది కలలు, కష్టం దాగి ఉన్నాయి. విడుదలకు ముందే ఇలా లీక్ అవ్వడం వెన్నుపోటు లాంటిది. దయచేసి ఎవరూ ఆ లింకులను షేర్ చేయకండి, థియేటర్లోనే సినిమాను చూడండి అని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెట్టింట ముక్కలు ముక్కలుగా ఈ సినిమా క్లిప్స్ దర్శనమివ్వడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది.
‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా..
ఈ చిత్రం తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా తెలుస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రీలీల చేసిన పాత్రను మలయాళ బ్యూటీ మమిత బైజు పోషించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఒక సామాన్య వ్యక్తి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాడు అనే అంశంతో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందింది.
ఆందోళనలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు
దాదాపు 400 నుంచి- 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం లీక్ అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు కన్నన్ రవి, జి. ధనంజయన్ వంటి వారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఎడిటింగ్ రూమ్ నుంచే ఈ ఫుటేజ్ లీక్ అయి ఉండవచ్చని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎన్ని కుట్రలు చేసినా మా దళపతి విజయాన్ని ఆపలేరు అంటూ సోషల్ మీడియాలో #SaveJanaNayagan అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం మొదలుపెట్టారు. పైరసీని ప్రోత్సహించకుండా, చట్టపరమైన చర్యల ద్వారా ఈ లింకులను తొలగించే పనిలో ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ నిమగ్నమైంది.