
- నేను సబ్ కాంట్రాక్టర్‌ను కాదు.. క్యాషియర్‌ను మాత్రమే : గోపగోని మోహన్‌గౌడ్
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్ముకోవడంలో ప్రధాన సూత్రధారి రామగుండం అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందరేనని అతని అనుచరుడు గోపగోని మోహన్‌గౌడ్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. కోరుకంటి చందర్ చేసిన వ్యవహారంలో తాను క్యాషియర్‌గా మాత్రమే పనిచేశానని చెప్పారు. ‘ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కార్మికులను సప్లై చేసే కాంట్రాక్ట్ కోల్‌కతాకు చెందిన ఓ లాజిస్టిక్స్కంపెనీకి వస్తే.. ఆ కాంట్రాక్ట్‌ను నల్గొండకు చెందిన బీఆర్‌ఎస్ లీడర్ శ్రీనివాసరాజుకు సంబంధించిన తిరుమల శంకుచక్ర ఫర్మ్ కంపెనీకి ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే లెటర్ రాశారు.
ఇందుకు గుడ్ విల్ కింద రూ.2 కోట్లు తీసుకున్నారు, ఆ తర్వాత ఆయన అనుచరులైన కొందరిని దళారులుగా పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఆ దళారులు నాకు డబ్బులు ఇస్తే నేను కోరుకంటి చందర్‌కు, ఆయన సూచించిన వారికి ఇచ్చాను’ అని చెప్పారు. కోరుకంటి చందర్ గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే… సుమారు రూ.మూడు కోట్లను ఇచ్చానని, ఇందులో కొంత నగదు, మరికొంత బ్యాంకు పేమెంట్ల ద్వారా చెల్లించానని, ఇందుకు ఆధారాలు సైతం ఉన్నాయన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొత్త కాంట్రాక్ట్ రావడంతో కొంతమందిని తొలగించారని, దీని వల్లే ఆందోళన మొదలైందని, ఒకరు ఆత్మహత్య చేసుకోగా, పలువురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు.
ఈ దందాలో అసలు సూత్రధారి కోరుకంటి చందర్ అయితే క్యాషియర్‌గా పనిచేసిన తనపై ఏడు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోరుకంటి చందర్ వల్ల ప్రాణభయం ఉందన్నారు. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తన ఇంటిపైకి దళారులను పంపించి ఆందోళన చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బులు ఇవ్వకపోతే హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఆఫీస్ ఎదుట కుటుంబంతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.