Reading Time: 2 minutes

బిఆర్‌ఎస్‌లో చేరాలని ఆయనను ఆహ్వానించాం

రెండు రోజుల్లో కెసిఆర్‌ను కలుస్తానన్నారు

అధికార మత్తులో రేవంత్ ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు: కెటిఆర్ 

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: రాజకీయం గా 42 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న జీవన్‌రెడ్డికి బిఆర్‌ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించడంతోపాటు ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు అనుగుణంగా గౌరవించుకుంటామని భారత రాష్ట్ర సమి తి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్‌రెడ్డిని బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కెటిఆర్ కరీంనగర్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బిఆర్‌ఎస్ నేతలతో కలిసి గురువారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి జీవన్‌రెడ్డితో మంతనాలు జరిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అధికార మత్తులో తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడన్నారు. తాము అధికారంలోకి వస్తే 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గద్దె నెక్కిన రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని, రైతులకు ఇవ్వాల్సిన రూ. 27 వేల కోట్లు ఎగ్గొట్టి కాంగ్రెస్ రైతులకు తీరని ద్రోహం చేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీతో 42 ఏళ్ల అనుబంధం ఉన్న సీనియర్ నేత జీవన్‌రెడ్డిని అవమానానికి గురి చేయడం దురదృష్టకరమన్నారు. రానున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఇటీవల బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి వెళ్లిన సందర్భంగా అక్కడ సుమారు 150 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు తనతో కరచాలనం చేసి అన్న వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పడాన్ని బట్టి చూస్తే కార్యకర్తలో రేవంత్ సర్కార్‌పై ఎంత అయిష్టత ఉందో స్పష్టమవుతోందన్నారు. ఇక ప్రజల్లో రేవంత్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ద్ధంగా ఉన్నారన్నారు.

జీవన్‌రెడ్డికి, కెసిఆర్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని కెటిఆర్ చెప్పుకొచ్చారు. 2014కు ముందు జీవన్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి రావాలని కెసిఆర్ ఆహ్వానించారని, అయితే నిబద్ద్ధత గల నాయకుడిగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక ఆ పార్టీలోనే కొనసాగారన్నారు. 2014లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో బోర్నపెల్లి వంతెనకు నిధులు మంజూరు చేయాలని కెసిఆర్‌ను కోరగానే అక్కడికక్కడే వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాగే అసెంబ్లీలో జరిగిన చర్చలో నిజాం షుగర్స్‌ను తెరిపించాలని జీవన్‌రెడ్డి కోరగా వెంటనే స్పందించిన కెసిఆర్ మహారాష్ట్రలో కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా నడిపిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ సొసైటీకి మీరే అధ్యక్షుడిగా ఉండాలని జీవన్‌రెడ్డి పేరును కెసిఆర్ ప్రతిపాదించినట్లు ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. పార్టీలోకి రావాలని జీవన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించామని, రెండు మూడు రోజుల్లో కెసిఆర్‌తో కలిసి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెబుతానని జీవన్‌రెడ్డి చెప్పినట్లు కెటిఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంఎల్‌సి ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, విద్యాసాగర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్‌గుప్తా, రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, రవీందర్‌సింగ్, తుల ఉమ, నారదాసు లక్ష్మన్‌రావు, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.