Reading Time: 2 minutes

కాంతార వివాదం: రణవీర్ క్షమాపణలో నిజాయితీ లేదు.. లేఖను తిరిగి రాయమంటూ కోర్టు ఆదేశం

Caption of Image.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్కు సంబంధించిన ‘’కాంతార: చాప్టర్ 1’ వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రిషబ్ శెట్టి నటించిన ఈ చిత్రంలోని ‘దైవ’ సన్నివేశాన్ని అనుకరించడం, దైవాలను “దెయ్యాలు”గా వ్యాఖ్యానించడం వల్ల రణ్‌వీర్‌పై కన్నడ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం పై కేసు నమోదు కావడంతో విషయం కర్ణాటక హై కోర్టుకు చేరింది. మార్చి 24, 2026న కోర్టు రణ్‌వీర్‌కు క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేయాలని, అలాగే కర్ణాటకలోని చాముండి దేవాలయాన్ని సందర్శించాలని సూచించింది. అనంతరం, రణ్‌వీర్ క్షమాపణ లేఖ సమర్పించినప్పటికీ, అందులో సరైన పశ్చాత్తాపం లేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు కూడా ఆ క్షమాపణ “నిజాయితీగా లేదని” అభిప్రాయపడింది.

తాజా విచారణలో రణ్‌వీర్ తరఫు న్యాయవాది.. కొత్తగా సవరించిన క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. కోర్టు ఇందుకు గడువు ఇచ్చింది. ఈసారి క్షమాపణలో ఉపయోగించే భాష, భావం కీలకంగా ఉండనున్నాయి. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 23న జరగనుంది.

అయితే, రణ్‌వీర్ తన అఫిడవిట్‌లో తాను ముంబైలో సింధీ కుటుంబంలో పెరిగినందున ఆ సంప్రదాయాల సున్నితత్వం తెలియలేదని, అలాగే దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే, రణ్‌వీర్ ఇచ్చిన క్షమాపణలో నిజమైన పశ్చాత్తాపం లేదని ఫిర్యాదుదారు ప్రశాంత్ మేతల్ అభ్యంతరం తెలిపారు. 

వివాదం ఎక్కడ మొదలైంది: 

గోవాలోని IFFI వేదికపైకి వచ్చిన రణవీర్ సింగ్, ‘కాంతార’ క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి చేసిన ‘దైవ’ పాత్రను అనుకరించారు. రిషబ్ శెట్టిని నేరుగా సంబోధిస్తూ.. “నేను ‘కాంతార చాప్టర్ 1’ థియేటర్లలో చూశాను. అద్భుతమైన ప్రదర్శన. ముఖ్యంగా ఆ ఆడ దెయ్యం (చాముండి దైవ) నీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అద్భుతం. రిషబ్ నటనలోని తీవ్రతను, అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని కొనియాడారు.

ఈ సమయంలోనే  రిషబ్ శెట్టి నవ్వుతూ కనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో నెటిజన్లు రణవీర్ వ్యాఖ్యలు, అనుకరణ అగౌరవంగా ఉన్నాయని విమర్శించారు. దైవాలను కేవలం ‘దెయ్యాలు’గా అభివర్ణించడం తీవ్ర అభ్యంతరకరమని, అవి అడవి దేవతలని, కేవలం దెయ్యాలు కావని వారు స్పష్టం చేశారు.

రణవీర్ సింగ్ క్షమాపణ 

ముఖ్యంగా కన్నడిగులు, సినీ ప్రియుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రణవీర్ సింగ్ క్షమాపణ సైతం చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. “నా ఉద్దేశ్యం కేవలం రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే. ఒక నటుడిగా, ఆ సన్నివేశంలో ఆయన చూపిన అసాధారణమైన కృషి నాకు తెలుసు. దాని పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, సాంస్కృతిక వైవిధ్యం పట్ల తన గౌరవాన్ని తెలియజేస్తూ..  ‘నేను ఎప్పుడూ మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం , నమ్మకాన్ని లోతుగా గౌరవించాను. నేను ఎవరి మనోభావాలను గాయపరిచినా, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను” అని రణవీర్ సింగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

అయినప్పటికీ.. FIR నమోదు అవ్వడంతో.. సీన్ మళ్ళీ మొదటికి వచ్చింది. కోర్టు క్షమాపణ అడగడం, ఆపై రణవీర్ సరైన రీతిలో చెప్పకపోవడం.. తిరిగి చెప్పమని ఆదేశించడం జరిగింది. కోర్టు కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేయగా.. ఆసక్తిగా మారనుంది. 

©️ VIL Media Pvt Ltd.