Reading Time: 2 minutes

రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడి భగ భగలు

ఏప్రిల్ 12 నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణలోని

కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 12 నుంచి 22 వరకు

40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే

జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఏప్రిల్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉష్ణతరంగ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు 40-41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం చారు.

బుధవారం రాష్ట్రంలో 26 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, శనివారం 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ ఆలర్ట్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు

వేసవి తాపం నుండి రక్షణ పొందే మార్గాలు

తీవ్రమైన వడగాల్పుల నుండి కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఈ సమయంలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ నుంచి రక్షణ కోసం దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు, గొడుగు వాడాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరించడం వల్ల ఎండ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అధిక ప్రోటీన్, ఉప్పు, మసాలా, నూనె ఎక్కువ ఉండే ఆహారం తినకుండా ఉండాలి. సూర్యకాంతిలో బయటకు వెళ్తే షూస్ లేదా చెప్పులు తప్పక ధరించాలి. పగటిపూట (ముఖ్యంగా సూర్యకాంతి పడే వైపు) కిటికీలు, కర్టెన్స్ మూసి ఉంచండి. రాత్రి చల్లని గాలి రావడానికి తెరిచి ఉంచడం చేయాలి. బయటి పనులు ఉదయం, సాయంత్రం చల్లని సమయంలోనే చేయండి.

ఇంట్లో తయారు చేసుకునే పానీయాలు

సులువుగా ఇంట్లోనే లభించే నిమ్మరసం, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్, ఉప్పు-చక్కర నీటి ద్వారా శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెపుతున్నారు. ప్రయాణం చేసేటప్పుడు నీళ్ల బాటిల్ తీసుకెళ్లండి. నీరు ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి (వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఆరెంజ్, ద్రాక్ష, అనాస, కాకరకాయ మొదలైనవి).

ఎండ దెబ్బ లక్షణాలు

ఎండ దెబ్బ గురయిన వ్యక్తి ఉండే లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి వికారం, వాంతులు, వేడి, ఎర్రటి, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండడం జరుగుతుంది. తలనొప్పి, ఆందోళన, మైకం, స్పృహ కోల్పోవడం, కండరాల బలహీనత, తిమ్మిర్లు, వేగవంతమైన హృదయ స్పందన, మానసిక గందరగోళం (గందరగోళం, కోపం, చిరాకు, సీజర్, కోమా) ఉంటాయని, వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.