
జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లిలో ఫారెస్ట్ ఆఫీసర్లను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎఫ్వో శివ్ ఆశిష్ సింగ్, జన్నారం ఏడీవో రామ్మోహన్, రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారయణ, ఫారెస్ట్ సిబ్బంది బాదంపల్లి గోదావరి పరివాహక ప్రాంతాన్ని సందర్శించి గురువారం సాయంత్రం తిరిగివస్తుండగా గ్రామ శివారులో ఇందిరమ్మ లబ్ధిదారులు, ట్రాక్టర్ యాజమానులు, గ్రామస్తులు కలిసి వారి వాహనాలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు.
ఇండ్ల నిర్మాణం కోసం గోదావరి నుంచి ఇసుక తీయకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకోవడం వల్ల నిర్మాణాలు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లేకుండా ఇండ్లు ఎలా కట్టుకోవాలని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఎఫ్డీవో రామ్మోహన్ కలుగజేసుకొని గోదావరి నుంచి ఇసుకను అనుమతించడం తమ చేతిలో లేదని, ఈ విషయాన్ని పైఆఫీసర్లకు తెలియజేస్తామని తెలిపారు. ఎలాగైనా ఇసుకను అనుమతించాలని ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు.