Reading Time: 2 minutes

నేడు పంజాబ్‌తో పోరు

ముల్లాన్‌పుర్: ఐపిఎల్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముల్లాన్‌పుర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సన్‌రైజర్స్‌కు ఈమ్యాచ్ సవాల్‌గా మారింది. సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. పంజాజ్ మూడింటిలో రెండు విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ పంజాబ్ విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరు చెలరేగితే సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదు. అయితే వీరి బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం ఆందోళన కలిగిస్తోంది. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే హెడ్, అభిషేక్‌లు రాణిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఇషాన్ తన మార్క్ బ్యాటింగ్‌తో విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం హైదరాబాద్‌కు ఇబ్బందేమీ కాదు. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు ఫామ్‌లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. వీరి ఈసారి కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ సత్తా చాటడం జట్టుకు సానుకూల పరిణామం. లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబె తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక హర్షల్ పటేల్, ఉనద్కట్, మలింగ, హర్ష్ దూబె, నితీశ్ కుమార్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా ఉండనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు పంజాబ్ జట్టులో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధెరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, చాహల్, అర్ష్‌దీప్, జాన్సన్, బార్ట్‌లెట్ తదితరులతో పంజాబ్ చాలా బలంగా ఉంది. అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.