
Jasmine Perfume at Home: వేసవికాలంలో చెమట వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు చాలామంది ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్లు ఉపయోగిస్తుంటారు. దాని కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు.. అయితే, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హానికరంగా ఉండటమే కాకుండా, సువాసన కూడా ఎక్కువసేపు నిలవదు. అది వాడి కాసేపటికే సువాసన మాయమైపోయే ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు ఎన్నో ఉన్నాయి.. అయితే, అలాంటి పరిస్థితిలో, ఇంట్లోనే సహజమైన మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ తయారు చేసుకోవడం ఒక మంచి ప్రత్యామ్నాయం.
మల్లె పువ్వుల సువాసన సహజంగా ఎంతో మధురంగా, తేలికగా ఉంటుంది. ఈ పువ్వులతో తయారుచేసే పెర్ఫ్యూమ్ రోజంతా తాజాగా ఉంచడమే కాకుండా చెమట వాసనను కూడా సమర్థంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి చర్మానికి కూడా సురక్షితం.
తయారీకి కావలసిన పదార్థాలు:
* తాజా మల్లె పువ్వులు
* సూది మరియు దారం
* గాజు సీసా (మూతతో)
* సెల్లో టేప్.
తయారీ విధానం:
* ముందుగా తాజా మల్లె పువ్వులను తీసుకుని సూది, దారంతో దండలా అల్లాలి. పువ్వులు తాజాగా ఉండేలా చూసుకుంటే సువాసన మరింత బాగుంటుంది. తరువాత గాజు సీసాను తీసుకుని ఆ దండను సీసా మధ్యలో గాలిలో వేలాడేలా ఉంచాలి. పువ్వులు సీసా గోడలకు తగలకుండా జాగ్రత్తపడాలి.
* దారపు చివరను సీసా మూతకు టేపుతో బిగించి, మూతను గట్టిగా మూసివేయాలి. ఆ తరువాత ఈ సీసాను రెండు రోజుల పాటు సూర్యరశ్మిలో ఉంచాలి. సూర్యుడి వేడి కారణంగా పువ్వులలోని సువాసన బయటకు వచ్చి సీసా లోపల నిల్వ అవుతుంది.
* రెండు రోజుల తరువాత పువ్వులు ఎండిపోయి రంగు మారుతాయి. సీసాలో కనిపించే చిన్న నీటి బిందువులే అసలైన మల్లె పెర్ఫ్యూమ్. ఇవే సహజ సువాసనను ఇస్తాయి.
నిల్వ విధానం:
* ఈ పెర్ఫ్యూమ్‌ను చిన్న రోల్-ఆన్ బాటిల్ లేదా స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. దీని సువాసన బలంగా ఉండటంతో తక్కువ పరిమాణం సరిపోతుంది.. ఈ సింపుల్ పద్ధతితో ఇంట్లోనే సహజమైన, ఖర్చు లేకుండా, చర్మానికి హాని లేకుండా మల్లె పువ్వుల పెర్ఫ్యూమ్ తయారు చేసుకుని వేసవిలో ఫ్రెష్‌గా ఉండండి.