
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మత్తు పనులు వేగవంతం చేయండి
మరమ్మత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
మంత్రి ఉత్తమ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు . వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమీక్ష నిర్వహించారు. మరమ్మత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటిని అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు.
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సిడబ్లుపిఆర్‌ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణ ను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ , సిడబ్ల్యూపిఆర్‌ఎస్ , బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్ తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్లుసి) సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డ లో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తొవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్ లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పనులలో జాప్యం జరగడానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కల్గనివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సిఎం కార్యదర్శి మానిక్ రాజ్, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.