Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం భూములపై దృష్టి పెట్టింది.. కానీ అభివృద్ధిపై పెట్టలేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను చెరబట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒఆర్ఆర్ లోపల భూములను ప్రజా అవసరాల కోసం కాపాడేవారని, శివరాజ్ బహదూర్ భూములను గత సిఎంలు కాపాడే ప్రయత్నం చేశారని తెలియజేశారు. ఈ ప్రభుత్వం భూములను ఎలా తీసుకోవాలనే ఆలోచన ఉందని, 600 మంది రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సబితా విమర్శించారు. ఇది ప్రభుత్వ భూమేనని హైకోర్టు కూడా చెప్పిందని, హైకోర్టు చెప్పినా కూడా అధికారులు భూములను స్వాధీనం చేసుకోవడం లేదని మండిపడ్డారు. భూములను కబ్జా చేసి రేకులు కట్టినా పట్టించుకోవడం లేదని, అది ప్రభుత్వ భూమేనని రెవెన్యూ మంత్రి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించాలని అన్నారు. పేదల ఇండ్లను హైడ్రా కమిషనర్ కూల్చి వేస్తున్నారని, హైడ్రా కమిషనర్ ఇది ప్రైవేట్ భూమి అంటున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని, భూములను కబ్జా చెర నుంచి కాపాడే వరకు పోరాడుతామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.