Reading Time: < 1 minute

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రతిష్టాత్మక గగన్‌యాన్ యాత్ర దిశలో ఓ అడుగు వేసింది. అత్యంత కీలకమైన రెండో ఇంటిగ్రేడెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ( ఐఎడిటి 02)ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించారు. చినూక్ హెలికాప్టర్‌తో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి క్రూ మాడ్యుల్‌ను జారవిడిచే ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయాణంలో వ్యోమగాముల సురక్షిత ప్రయాణం దిశలో ఈ ప్రక్రియ అత్యవసరం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం విజయవంత పరీక్ష పట్ల కేంద్ర ఎర్త్‌సైన్స్ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సిబ్బందిని, సైంటిస్టులను అభినందించారు. వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్ నిర్వహిస్తారు. క్రూ మోడల్ రికవరీ గగన్‌యాన్ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. దీనిని పలుసార్లు పరీక్షించిన తరువాత గగన్‌యాన్ తేదీ వివరాలు ఖరారు అవుతాయి.