Reading Time: 4 minutes

తెలంగాణ వ్యవసాయ భవిష్యత్తుకు పంట మార్పిడి అనివార్యం

Caption of Image.

ఇటీవల  సీఎం రేవంత్​రెడ్డి  ఒక సభలో  మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం  పంట మార్పిడికి  కట్టుబడి ఉంది అని ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన ప్రకటన.  ఇదివరకు కూడా సీఎం పంట మార్పిడి గురించి మాట్లాడారు తప్ప ఆ దిశగా మార్పులు తీసుకురాలేదు.  దానిమీద ఆలోచన కూడా చేయలేదు.  విస్తృత సంప్రదింపులు మృగ్యం.  ఇప్పుడు కూడా నినాదం ఇచ్చి  వదిలివేయడం కంటే ఆ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది.  తెలంగాణలో వ్యవసాయం చాల దారుణ పరిస్థితిలో ఉన్నది.  దాదాపు కోటి పైన ఉన్న ఎకరాలలో కేవలం వరి,  పత్తి పంటల విస్తీర్ణం దాదాపు 95 శాతం ఉన్నది.  మిగతా ఎకరాలలో 10 రకాల పంటలు ఉన్నాయి.

ఈ రకమైన  వ్యవసాయం ఆహార భద్రతను ప్రశ్నిస్తోంది.  తగ్గిపోయిన  పోషకాలను గుర్తు  చేస్తోంది.  సబ్సిడీ ఇస్తేగాని బియ్యం తినలేని ఆర్థిక దుస్థితిలో లక్షల  కుటుంబాలు ఉన్నాయి.  ఒకే పంట పండించినా కూడా ఆ పంటను  కొనలేని పరిస్థితి ఉన్నది. 

తెలంగాణ  వ్యవసాయ  భవిష్యత్తు  ప్రమాదంలో పడింది.  వ్యవసాయ వనరులు తగ్గిపోతున్నాయి. రాష్ట్ర రైతులు, నీటిపారుదల జిల్లాల్లో ప్రధానంగా వరి, మెట్ట ప్రాంతాల్లో పత్తివంటి ఏకపంట సాగు విష వలయంలో చిక్కుకున్నారు.  ఇది భూగర్భ జలాలను,  నేల సారాన్ని, పంటల జన్యు వైవిధ్యాన్ని తగ్గిస్తూ..  రైతులపై  రుణభారాన్ని  మరింత పెంచుతోంది. ఈ విషవలయం ‘హరిత విప్లవ’ వ్యవసాయ పద్ధతుల వల్ల మాత్రమే ఏర్పడినది కాదు. ఇది జాతీయ,  రాష్ట్ర  ప్రభుత్వాల విధానాల  తార్కిక పర్యవసానం కూడా.  ఈ  విధానాలు  కేవలం  రెండు,  మూడు పంటలకు  హామీతో  కూడిన కొనుగోలు సౌకర్యం కల్పించి,  మిగతా పంటలన్నింటినీ మార్కెట్ అనిశ్చితిలో  పడేస్తున్నాయి.  దీనిని సరిదిద్దడానికి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వపరంగా జోక్యం అవసరం.   కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసి ఊరికే కూర్చుంటే ఉపయోగం లేదు. సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణకు  వైవిధ్యభరిత  వ్యవసాయ వారసత్వం

తెలంగాణకు  వైవిధ్యభరితమైన గొప్ప వ్యవసాయ వారసత్వం ఉంది.  ఉత్తర తెలంగాణ (నిజామాబాద్ నుంచి) పసుపు, తెలంగాణ  పీఠభూమి అంతటా వేరుశనగ, ఆముదం,  ఆదిలాబాద్,  కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పప్పుధాన్యాల సాగు,  వర్షాధార  మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలు,  పట్టణ శివారుప్రాంతాల్లో  కూరగాయలు,  జహీరాబాద్  ప్రాంతంలో  ఆలుగడ్డలు, అల్లం,  వెల్లుల్లి  వగైరా కూడా పండేవి.  చెరకు, మక్కలు, జొన్నలు కూడా  పండుతాయి.  ఈ  పంటలు పోషకపరంగా శ్రేష్ఠమైనవి.  పర్యావరణానికి అనువైనవి.  తక్కువ నీటి వినియోగం గలవి.   సాంస్కృతికంగా పాతుకుపోయినవి.  వాటిని విడిచిపెట్టడానికి కారణం వరి,  గోధుమలకు ఇస్తున్నంత  ఆర్థిక భద్రతను  రాష్ట్ర,  జాతీయ  ప్రభుత్వాలు  రైతులకు  కల్పించకపోవడమే.  ఈ  అసమతుల్యతను  సరిదిద్దడానికి తనకు అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన, ఆర్థికపరమైన వెసులుబాటును రాష్ట్ర  ప్రభుత్వం ఉపయోగించుకోవాలి.

సంప్రదాయ పంటలకు కనీస ధరలను ప్రకటించాలి

తెలంగాణలో  వివిధ రకాల సంప్రదాయ  పంటలకు  రాష్ట్రస్థాయిలో  కనీస ధరలను  ప్రకటించాలి.  తెలంగాణ  విత్తన అభివృద్ధి  సంస్థ  చైర్మన్  అన్వేష్ రెడ్డి కూడా దీనికోసం డిమాండ్ చేస్తున్నారు.  రైతు సంక్షేమానికి ఆచరణలో తీసుకోవాల్సిన  సమర్థవంతమైన ప్రత్యక్ష చర్య. ఇప్పటివరకు కనీస ధర లేని పంటలకు లాభదాయకమైన కనీస ధరలను ప్రకటించడమే.  23 పంటలకు నిత్యం ప్రకటిస్తున్న జాతీయ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)  కాగితాల మీద ఉన్నప్పటికీ,  కేవలం వరి, గోధుమలకు  మాత్రమే  ప్రభుత్వపరంగా సేకరణ  కార్యాచరణపరంగా హామీ లభిస్తున్నది.  పసుపు, ఆముదం, వేరుశనగ, పప్పుధాన్యాలు (కంది, మినుములు, పెసర, ఉలవలు), చిరుధాన్యాలు (జొన్న, బజ్రా,  రాగి,  కొర్ర, సామలు),  కూరగాయలు వంటి  అవసరమైన,  నిత్యావసర  పంటల  విషయంలో  రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి హామీ లేదు.  దీంతో  రైతులు ఆ పంటలను  తగ్గిస్తున్నారు. కొన్ని పంటలు కనుమరుగు అయిపోయాయి.  దిగుమతి ద్వారా  మాత్రమే మనకు అందుబాటులోకి వస్తున్నాయి.  పరిమిత పంటల వల్ల ఏర్పడుతున్న సామాజిక, ఆర్థిక,  ప్రాకృతిక  దుష్పరిణామాలను  రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా  పరిష్కరించగలదు.  ప్రభుత్వం  పంటలకు  ప్రతి వర్షాకాలానికి  ముందే  కనీస ధరలను  ప్రకటించాలి.  తద్వారా  రైతులు ధరల స్పష్టతతో  పంట నిర్ణయాలు తీసుకోగలరు.  

విత్తన వ్యవస్థను పునర్నిర్మించాలి

పంటల వైవిధ్యం కోసం సంప్రదాయ  విత్తన వ్యవస్థను  పునర్నిర్మించాలి.  పంటల వైవిధ్యీకరణకు  అత్యంత కీలకమైన అడ్డంకులలో ఒకటి  విత్తనాల కొరత.   
తెలంగాణలోని  విభిన్న వ్యవసాయ- పర్యావరణ మండలాలకు అనువైన పప్పుధాన్యాలు,  చిరుధాన్యాలు,  నూనెగింజలు, పసుపు వంటి సంప్రదాయ రకాలకు  నాణ్యమైన విత్తనాలు  పూర్తిస్థాయిలో  అందుబాటులో లేవు.  చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే లభిస్తున్నాయి.  ఒకప్పుడు ఈ వైవిధ్యాన్ని నిర్వహించిన సామూహిక,  గ్రామీణ ప్రాంత  విత్తన వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయి. ఈ అంతరాన్ని పూరించడానికి ప్రైవేట్ విత్తన కంపెనీల మీద ఆధారపడితే లాభం లేదు.  వాణిజ్యపరంగా విత్తన కంపెనీలకు కొన్ని రకాలకు, కొన్ని పంటలకు పరిమితం అయిన వ్యవసాయమే లాభదాయకం.  అందుకే  రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.  అన్ని జిల్లాల్లో,  పంచాయతీ,  మండల స్థాయిలలో  సామూహిక విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయాలి.  ముఖ్యంగా, సంప్రదాయ విత్తన పరిజ్ఞానం ఇంకా ఉన్న గిరిజన ప్రాంతాలకు,  దక్షిణ  తెలంగాణకు  (ఆదిలాబాద్,  భద్రాద్రి కొత్తగూడెం, ములుగు) ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.   తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ (టీఎస్డీసీ) విత్తన పంపిణీ లక్ష్యాలను సవరించాలి.  ఇందులో భాగంగా,  చిరుధాన్యాలు,  పప్పుధాన్యాలకు నిర్దిష్ట ఉప -లక్ష్యాలతోపాటు, వివిధ వరియేతర పంటలకు తప్పనిసరిగా  కనీసం 30 శాతం  కేటాయింపు ఉండేలా చూడాలి.  

వ్యవసాయ విస్తరణలో  మార్పు రావాలి

దశాబ్దాలుగా ఏకపంట సాగు వల్ల, అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల తెలంగాణలోని అనేక జిల్లాల్లోని నేలలు క్షీణించాయి.  నేల ఆరోగ్య కార్డు పథకం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన, తదుపరి చర్యలు లేవు.  విభిన్న పంటల  సాగుకు  అనుగుణంగా  వ్యవసాయ రుణాలు, బీమాను  అనుసంధానించాలి.  కిసాన్  క్రెడిట్ కార్డ్  రుణ పరిమితిని  ప్రకటించిన పంటల సరళి ఆధారంగా నిర్ణయిస్తారు.  కొత్త పంటను  ప్రయత్నించాలనుకునే  రైతుకు బ్యాంకు ఋణం దొరికే పరిస్థితి లేదు. ఇది మారాలి.  తగిన ఆర్థిక సహాయ వ్యవస్థను రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.   వ్యవసాయ విస్తరణలో మార్పు రావాలి.  వ్యవసాయ పురోగతిని కొలిచే కొలమానాలను మార్చాలి.  వైవిధ్యాన్ని గుర్తించి,  దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవిధంగా రాష్ట్ర వార్షిక ఆర్థిక సర్వే, బడ్జెట్ పత్రాలకు అవసరమైన సమాచార సేకరణ మార్చాలి.  జిల్లా స్థాయి పనితీరు సమీక్షలకు అవసరమయ్యే సమాచార  సేకరణకు పునఃరూపకల్పన చేయాలి.  విభిన్న పంటల వల్ల వచ్చే సత్ఫలితాలను కొలిచే కొలమానాలు తయారు చెయ్యాలి.  

ప్రత్యేక ప్రణాళికలు అవసరం

 తెలంగాణలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులైన నాగార్జున సాగర్,  శ్రీశైలం,  సింగూర్, మరికొన్ని ఇటీవల ప్రాజెక్టులు లక్షలాది హెక్టార్ల భూమిని  కాలువల పరిధిలోకి  తీసుకువచ్చాయి.  ఈ ఆయకట్టు  ప్రాంతాలు  ఏకపంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.  వారాబందీ నీటి కేటాయింపు విధానం ఏకపంట వరి కోసమే రూపొందింది.  కమాండ్  ఏరియాలో సాగునీటి పంపిణీ  ప్రణాళికకు అంతరాయం  కలిగించకుండా ఒక రైతు వేరే  పంటను వేయలేడు.  అందుకే,  దీనిని సంస్కరించకుండా ఆయకట్టు ప్రాంతాలలో  పెద్ద ఎత్తున పంటల వైవిధ్యం అసాధ్యం.  ఈ  దిశగా పంటల మార్పిడి కోసం  ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉన్నది.  రబీ  సీజన్‌‌‌‌లో కనీసం రెండు  కమాండ్  ఏరియాలలో  పంటల  విషయంలో  సౌలభ్యం కల్పించే  వారాబందీ  షెడ్యూళ్లను  ప్రయోగాత్మకంగా అమలుచేయడం,  కమాండ్ ఏరియాలోని కనీసం 20 శాతం భూమిలో వరియేతర  పంటలను  పండించడానికి వీలు కల్పించాలి.  నేల సారం పెంచే  కార్యక్రమాలు  ప్రారంభించాలి.  రాష్ట్ర  ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించినప్పుడు ఏమి సాధ్యమవుతుందో  కర్నాటక, ఒడిశా నిరూపించాయి.  తెలంగాణ  ప్రభుత్వం ఈ దిశగా పయనించాలి.

– డా.దొంతి నరసింహారెడ్డి
పాలసీ ఎనలిస్ట్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
 

©️ VIL Media Pvt Ltd.