Reading Time: < 1 minute
Andhra Pradesh Municipal Elections 2026 Cabinet Decision Updates

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల సందడి ముగియగా.. ఏపీలో కూడా అదే జోష్‌తో మున్సిపల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులందరూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఏపీ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక కసరత్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త జనాభా లెక్కల సేకరణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీని ప్రకారం వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Also Read:Sunil Narine-IPL: అల్లాటప్పా బ్యాటర్లను కాదు, టాప్ దిగ్గజాలనే సుస్సు పోయించాడు.. నరైన్‌తో మాములుగా ఉండదు!

గత కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మంత్రులకు సీఎం దిశానిర్దేశం
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి నిదర్శనంగా మారుతాయని, కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక వ్యూహాలు రచించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రింకింగ్ వాటర్, రోడ్ల మరమ్మతులు వంటి మౌలిక అంశాలపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే అభ్యర్థుల ఎంపిక మరియు వార్డుల వారీగా వ్యూహాలపై దృష్టి పెట్టాయి.