Reading Time: 2 minutes

వైట్‌‌హౌస్‎లో ఇన్‌‌సైడర్‌‌‌‌ ట్రేడింగ్‌..‌! పశ్చిమాసియా యుద్ధ సమాచారంతో  కోట్లు గడించిన ట్రేడర్లు

Caption of Image.

వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్‌‌ మార్కెట్లలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందే, మార్కెట్‌‌లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరగడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. రహస్య సమాచారం లీక్ అవ్వడం వల్లే కొందరు ట్రేడర్లు కోట్లాది రూపాయలు లాభపడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

వీరిలో ఎక్కువమంది అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌‌హౌస్‌‌  సిబ్బంది, వారి సన్నిహితులే ఉన్నట్టు పలు నివేదికలు బయటపెట్టాయి. ఇరాన్‌‌ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల గురించి అంతర్గత సమాచారం తెలిసినవారు దాన్ని పలువురు ఇన్వెస్టర్లకు లీక్‌‌ చేస్తున్నట్టు వెల్లడించాయి. 

అయితే, మొదట్లో ఈ ఆరోపణలను కొట్టిపారేసిన వైట్ హౌస్.. ఏప్రిల్ నాటికి తన వైఖరిని మార్చుకున్నది. సున్నితమైన ప్రభుత్వ సమాచారంతో ఫ్యూచర్స్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయొద్దని తన సిబ్బందికి అంతర్గత హెచ్చరికలు జారీ చేసింది. అక్రమంగా లాభాలు పొందడం నిషేధమని అధికారులు చెప్పారు. దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

అనుమానాస్పద ట్రేడింగ్ – ప్రధాన సంఘటనలు..

జనవరి: వెనుజువెలాపై అమెరికా చర్యలు తీసుకోవడానికి ముందే ‘పాలిమార్కెట్’లాంటి ప్లాట్‌‌ఫామ్‌‌లలో భారీగా బెట్టింగ్‌‌లు జరిగాయి. 
మార్చి మొదటి వారం: ఇరాన్‌‌పై అమెరికా దాడి చేయడానికి కొన్ని గంటల ముందే కొందరు ట్రేడర్లు పాలిమార్కెట్‌‌లో బెట్టింగ్ కాంట్రాక్టులతో 1.2 మిలియన్​ డాలర్లు (రూ.10 కోట్ల) లాభాన్ని ఆర్జించారు. 
మార్చి 23న.. 6:49 గంటలకు.. అంటే ట్రంప్ ఇరాన్ దాడుల విరామం గురించి ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందే,  500 మిలియన్‌‌ డాలర్ల నుంచి 830 మిలియన్​ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరిగింది. ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోవడంతో ఈ ట్రేడర్లు భారీగా లాభపడ్డారు. 
ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇన్‌‌సైడర్‌‌‌‌ ట్రేడింగ్ కేసు కావచ్చని చట్టసభ సభ్యులు భావిస్తున్నారు.
ఏప్రిల్ మొదటి వారం: అమెరికా––ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించడానికి కొద్ది గంటల ముందు, సుమారు 950 మిలియన్​ డాలర్ల ఆయిల్ ఫ్యూచర్స్ బెట్లు నమోదయ్యాయి. ప్రకటన తర్వాత చమురు ధరలు 15 శాతం పతనమయ్యాయి.

ప్రభావం ఏమిటి..?

ఇలాంటి ముందస్తు ట్రేడింగ్ వల్ల సామాన్య ఇన్వెస్టర్లకు మార్కెట్‌‌పై నమ్మకం పోతుంది. ప్రభుత్వ కీలక నిర్ణయాలు బయటకు పొక్కుతున్నాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌‌ఈసీ), కమొడిటీస్‌‌ ఫ్యూచర్‌‌‌‌ ట్రేడింగ్‌‌ కమిషన్‌‌ (సీఎఫ్‌‌టీసీ)లాంటి సంస్థలు దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ట్రేడింగ్ సమయాలు కేవలం యాదృచ్ఛికం కావు. ఈ కుంభకోణంపై విచారించి, కొత్త నిబంధనలు తీసుకురావాలని చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.