Reading Time: < 1 minute
Andhra: కల్యాణి ఇలా చేస్తదనుకోలేదు.. శ్రీమంతం ముచ్చట తీరకముందే..

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన మరీదు తేజ్ కుమార్ కి, బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవికి చెందిన కల్యాణికి 2025 ఆగష్టులో వివాహం అయింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో పెళ్లి రోజు పెద్ద ఎత్తునే కట్న కానుకులు ఇచ్చారు. వివాహం సమయంలో మూడు ఎకరాల పొలం, ఐదు లక్షల నగదు, 25 సవర్ల బంగారు ఆభరణాలను కట్నం ఇచ్చారు. తేజ్ కుమార్ మంగళగిరి సమీపంలోని ఒక ప్రవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే తేజ్ కుమార్, అతని సోదరుడు, అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. గత కొద్ది కాలంగా కల్యాణికి తోడికోడలకి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వేరు కాపురాలు పెట్టాలని నిర్ణయించుకొని వారం రోజుల క్రితం తేజ్ కుమార్ వేరు కాపురం పెట్టాడు.

ఈ క్రమంలోనే నిన్న ఎప్పటిలాగే తేజ్ కుమార్ ఉద్యోగానికి వెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన తేజ్ కుమార్ బంధువులను ఇంటికి వెళ్లి చూసిరమ్మన్నాడు. వాళ్లు వెళ్లి తలుపు కొట్టినా కల్యాణి తీయలేదు. దీంతో తలుపు పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించింది. ఆమె బందువులకు, పోలీసులకు తేజ్ కుమార్ సమాచారం ఇచ్చాడు.

అయితే, తేజ్ కుమార్ గత కొంతకాలంగా తమ కుమార్తెను అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని కల్యాణి బంధువులు చెప్పారు. పది లక్షల రూపాయల అప్పులున్నట్లు కల్యాణి చెప్పిందన్నారు. వివాహ సయమంలో ఆస్తి మొత్తం తేజ్ కుమార్ దే అని చెప్పారని తీరా ఆస్తి విషయంలోనూ కుటుంబ సభ్యుల మద్య విబేధాలున్నట్లు తమ కుమార్తె తెలిపిందన్నారు. ఈ క్రమంలోనే మీ పుట్టింటి నుండి అధిక కట్నం తీసుకురావాలని వేధిస్తున్నట్లు చెప్పిందన్నారు.

అయితే, శ్రీమంతం చేసిన తర్వాత డబ్బు సర్దుబాటు చేస్తామని ఆమెకు తల్లిదండ్రులు చెప్పారు. ఈ నెలలో ఆమెను తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. వరకట్న హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..