
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పరిధిలో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న శుభంకర్ కుమార్ (24)పై సామూహిక దాడికి పాల్పడి, మొబైల్ ఫోన్ దోచుకున్న ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 9న బాధితుడు యూసుఫ్‌గూడ నుంచి కేబీఆర్ పార్క్ వైపు వెళ్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ లేన్ వద్ద నిందితులు అతన్ని అడ్డగించి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించి ఫోన్‌ను లాక్కున్నారు. అనంతరం అతని స్కూటీని కూడా ధ్వంసం చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోగా, బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు రేసు ప్రణీత్ రెడ్డి (19), బార్ల పవన్ కల్యాణ్ (20)ను శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.