Reading Time: < 1 minute

కుంకుమ పువ్వు కృత్రిమ సాగుతో మంచి ఫలితాలు : నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ భాస్కర్

Caption of Image.
  •     నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయభాస్కర్ 
  •     ఏరోపోనిక్ ప్రయోగశాలను ప్రారంభించిన నాబార్డ్ సీజీఎం

హైదరాబాద్, వెలుగు:  ఏరోపోనిక్ పద్ధతిలో కృత్రిమ నియంత్రిత వాతావరణంలో కుంకుమపువ్వు సాగు రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తోందని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయభాస్కర్ తెలిపారు.  శుక్రవారం మోజెర్ల హార్టికల్చర్ కాలేజీలో ఏరోపోనిక్ కుంకుమపువ్వు ల్యాబ్​ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి విద్యార్థులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణల వినియోగంతో అగ్రికల్చర్, హార్టికల్చర్ అనుబంధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తుందన్నారు. 

నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్​లో ఉష్ణోగ్రత, కృత్రిమ సూర్యకాంతి, గాలిలో తేమను నియంత్రిస్తూ కుంకుమపువ్వు సాగు చేయవచ్చని తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఏరోపోనిక్ కుంకుమ పువ్వు సాగు యూనిట్ ఖర్చును తెలియజేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సెన్సార్ ఆధారిత సాగు వంటి సాంకేతికతలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. 

రైతుల ఆదాయాన్ని పెంచే కొత్త పద్ధతులకు నాబార్డ్ మద్దతు ఇస్తుందన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు, తోటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో కుంకుమ పువ్వు ప్రాజెక్టు పరిశోధకుడు ప్రొఫెసర్ పెడిగం సైదయ్య, వర్సిటీ డీన్ డాక్టర్ జె.చీనా, అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోషి, హార్టికల్చర్​ఆఫీసర్​విజయభాస్కర్ రెడ్డి, నాబార్డ్ అధికారులు షణ్ముఖాచారి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.