Reading Time: < 1 minute

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళా బిల్లు, చట్టసభలలో సీట్ల పెంపుదలకు కేంద్రంచర్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కోడ్) ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. శుక్రవారం ఇక్కడ ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశంలో మాట్లాడారు. డిలిమిటేషన్‌తో నిమిత్తం లేకుండా మహిళా కోటా పెంపుదలకు, ఎంపీ స్థానాల పెంపుదలకు మోడీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకూ ప్రత్యేక సిట్టింగ్‌లకు దిగుతోంది. రాజ్యాంగ సవరణల బిల్లులను ఆదరాబాదరగా చేపట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. పైగా కోడ్ నేలరాయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కేంద్రం చర్యలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్థిష్ట వ్యూహం రూపొందించుకుంటుందని తెలిపారు.

ఇప్పుడు సిడబ్లుసి సమావేశం కూడా ఈ దిశలోనే ఏర్పాటు చేశామని ఖర్గే వెల్లడించారు. శుక్రవారం నాటి సమావేశానికి ఖర్గే అధ్యక్షత వహించారు. పార్టీ ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, జై రాం రమేష్ ఇతరులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్నాటక సిఎం సిద్ధరామయ్య, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ , మాజీ స్పీకర్ మీరా కుమార్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు. ఇంతకాలం మౌనంగా ఉంటూ వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు మహిళా రిజర్వేషన్లపై వేగం పెంచింది. అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణలను కూడా ఎటువంటి చర్చలకు అవకాశం లేకుండా చేసుకుని ఆమోదింపచేసుకునేందుకు పావులు కదుపుతోందని ఖర్గే ఆరోపించారు. ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని, ఇతర విపక్షాలతో కలిపి దీనిని ఎదుర్కొంటామని ప్రకటించారు.